వాట్సప్ గవర్నెన్స్, అవేర్ 2.0పై కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సమావేశం రెండో రోజు కొనసాగుతోంది. కీలక నిర్ణయాలు, సాంకేతిక ఆధారిత పాలనపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ సేవలను పూర్తిగా డిజిటల్‌ విధానంలో ప్రజలకు చేరవేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యంగా వాట్సప్ గవర్నెన్స్, అవేర్ 2.0 వంటి టెక్నాలజీ ఆధారిత వ్యవస్థల వినియోగంపై కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలు , పరిపాలనా ప్రక్రియలు ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా ఉండాలని సూచించారు. ప్రజలు చిన్నచిన్న పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ సమయం వృథా చేసుకోవాల్సిన పరిస్థితి మారాలని అన్నారు. ఆన్‌లైన్ సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రజలకు త్వరితగతిన సేవలు అందించవచ్చని తెలిపారు.

టెక్నాలజీ ఇంటిగ్రేషన్ ద్వారా పాలన మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మారుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ఇప్పటికే ప్రభుత్వ సేవల్లో 90 శాతం ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు. మనమిత్ర కార్యక్రమం ద్వారా ప్రజలకు వాట్సప్ సేవల వినియోగంపై శిక్షణ ఇస్తున్నామని, ఇప్పటివరకు 29 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చామని తెలిపారు. డిసెంబరు నాటికి అన్ని ప్రభుత్వ సేవలను వాట్సప్‌లో అందించే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని ఆదేశించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 34 శాతం కుటుంబాలకు స్మార్ట్‌ఫోన్లు లేవని సీఎం గుర్తుచేశారు. అందువల్ల మాన్యువల్ టచ్ పాయింట్లకు వచ్చే ప్రజలకు కూడా వాట్సప్ సేవల వినియోగంపై అవగాహన కల్పించాలని కలెక్టర్లకు సూచించారు. ఆన్‌లైన్ సేవల విస్తరణ వల్ల అవినీతి, దుర్వినియోగం తగ్గే అవకాశముందని పేర్కొన్నారు.

అదేవిధంగా అవేర్ 2.0 వ్యవస్థ నుంచి వచ్చే సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషిస్తూ నిర్ణయాలు తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రకృతి వైపరీత్యాల హెచ్చరికల విషయంలో మరింత ఖచ్చితత్వం అవసరమని అన్నారు. ముఖ్యంగా పిడుగులు, తుపాన్ల హెచ్చరికలను ప్రజలకు ముందుగానే చేరవేయాలని, అవసరమైతే నేరుగా మొబైల్ ఫోన్లకు మెసేజులు పంపే విధానం అమలు చేయాలని తెలిపారు. స్వర్ణ గ్రామాలు, వార్డు వ్యవస్థల ద్వారా కూడా హెచ్చరికలను గ్రామస్థాయికి చేరవేయాలని ఆదేశించారు.

తీరప్రాంత జిల్లాల కలెక్టర్లకు ప్రత్యేకంగా సూచనలు చేసిన సీఎం, సీవీడ్ సాగుపై దృష్టి పెట్టాలని కోరారు. దీనివల్ల తీరప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.

అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల్లో అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సీఎం స్పష్టం చేశారు. మున్సిపాలిటీలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరగకుండా పర్యవేక్షించాలని కలెక్టర్లను ఆదేశించారు. నగరాభివృద్ధి ప్రణాళికలకు అనుగుణంగా కట్టడాలు ఉండేలా చూడాలని చంద్రబాబు సూచించారు.

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్