34.2 C
Hyderabad
Saturday, May 9, 2026
spot_img

అతి పెద్ద పార్టీ.. కానీ ప్రతిపక్షంలో… నాటి ప్రమోద్ మహాజన్ ప్రసంగం వైరల్

తమిళనాడులో హంగ్ అసెంబ్లీ పరిస్థితులు నెలకొన్న వేళ… దాదాపు 30 ఏళ్ల క్రితం మాజీ బీజేపీ నేత ప్రమోద్ మహాజన్( Pramod Mahajan) చేసిన ఓ ప్రసంగం ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో జరుగుతున్న కూటమి చర్చలకు ఆ ప్రసంగం అచ్చం సరిపోతుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

తమిళనాడులో ఏం జరుగుతోంది?

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్( Vijay) నేతృత్వంలోని తమిళ వెట్రి కళగం( Tamilaga Vettri Kazhagam) అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయినప్పటికీ పూర్తి మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటుకు రెండడుగుల దూరంలో నిలిచిపోయింది. చిన్న చిన్న పార్టీల మద్దతు కోసం టీవీకే( TVK) ప్రయత్నిస్తోంది. ఒకరు లేదా ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీలే ఇప్పుడు కీలకంగా మారాయి. ఈ పరిస్థితుల మధ్య 1997లో ప్ర‌మోద్ మహాజ‌న్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ చర్చకు వచ్చాయి.

1997లో ప్ర‌మోద్ మహాజ‌న్ ఏమన్నారు?

మాజీ బీజేపీ నేత ప్రమోద్ మహాజన్( Pramod Mahajan) 1997లో లోక్‌సభలో చేసిన ప్రసంగం భారత కూటమి రాజకీయాలపై అత్యంత ఆసక్తికరమైన వ్యాఖ్యలలో ఒకటిగా గుర్తింపు పొందింది. అప్పట్లో ప్రధాని దేవేగౌడ( HD Deve Gowda) ప్రభుత్వంపై విశ్వాస తీర్మానం జరుగుతున్న సమయంలో మహాజన్ ఈ ప్రసంగం చేశారు.

ప్రసంగం ప్రారంభంలో ఆయన ఓ ఆసక్తికర సంఘటనను వివరించారు. భారత పార్లమెంటు ప్రతినిధి బృందం ఒకసారి చైనాకు వెళ్లిందని, ఆ బృందానికి రమాకాంత్ ఖలప్( Ramakant Khalap) నాయకత్వం వహించారని చెప్పారు. అప్పుడు చైనా ప్రతినిధులు భారత ప్రజాస్వామ్యం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనే ఆసక్తి చూపారని మహాజన్ తెలిపారు. దానికి తాను ఇచ్చిన సమాధానాన్ని లోక్‌సభలో సరదాగా వివరించారు.

మహాజన్ మాట్లాడుతూ… “నేను ప్రమోద్ మహాజన్. నేను లోక్‌సభ సభ్యుడిని. దేశంలో అతిపెద్ద పార్టీకి చెందినవాడిని. కానీ ప్రతిపక్షంలో ఉన్నాను” అని చెప్పానన్నారు. ఇది విన్న చైనా ప్రతినిధులు ఆశ్చర్యపోయారని ఆయన అన్నారు. ఎందుకంటే సాధారణంగా అతిపెద్ద పార్టీ అధికారంలో ఉండాలని వారు భావించారని చెప్పారు. తర్వాత మహాజన్ కాంగ్రెస్ ఎంపీ శ్రీ వల్లభ్ పాణిగ్రహి( Sriballav Panigrahi) వైపు చూపిస్తూ ….“ఇతను దేశంలో రెండో అతిపెద్ద పార్టీకి చెందినవాడు. కానీ ఆయన పార్టీ ప్రభుత్వంలో లేదు. అయితే అదే ప్రభుత్వం బయట నుంచి మద్దతు ఇస్తోంది.” అంటే కాంగ్రెస్ ప్రభుత్వం లో భాగం కాకపోయినా… ఆ ప్రభుత్వాన్ని కాపాడుతోందని ఆయన వ్యంగ్యంగా చెప్పారు. ఆ తర్వాత CPI(M) నేత ఎంఏ బేబీ గురించి మాట్లాడుతూ… “ఇతను మూడో అతిపెద్ద పార్టీకి చెందినవాడు. ఆయన పార్టీ కూటమిలో ఉంది. కానీ ప్రభుత్వంలో మాత్రం లేదు” అని అన్నారు. ఇక చివరగా రమాకాంత్ ఖలాప్‌ను చూపిస్తూ మహాజన్ చమత్కరించారు… “ఇతనే తన పార్టీకి ఏకైక సభ్యుడు. కానీ ప్రభుత్వంలో మంత్రి పదవిలో ఉన్నాడు.” అని అన్నారు.

ఈ ఉదాహరణల ద్వారా భారత కూటమి రాజకీయాల్లో ఉన్న విచిత్ర పరిస్థితిని మహాజన్ వివరించారు.
అంటే:

అతిపెద్ద పార్టీ ప్రతిపక్షంలో ఉంది
రెండో పెద్ద పార్టీ బయట నుంచి మద్దతు ఇస్తోంది
చిన్న పార్టీలు ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్నాయి
ఒక్క సభ్యుడు ఉన్న పార్టీకి కూడా మంత్రిపదవి దక్కుతోంది… అని ఆయన సెటైరికల్‌గా చెప్పారు.

మహాజన్ ఇంకా మాట్లాడుతూ… ఇలాంటి విరుద్ధ పరిస్థితుల్లో మరిన్ని ఆశ్చర్యాలు కూడా జరగొచ్చని అన్నారు. ఇంకా చిన్న పార్టీల నాయకులు కూడా పెద్ద పదవులకు రావచ్చని వ్యాఖ్యానించారు. అలాగే అప్పటి ప్రధాని దేవెగౌడపై కూడా సరదాగా వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమావేశాల్లో ఆయన నిద్రపోతారని వచ్చిన విమర్శలను ప్రస్తావిస్తూ… “దేశం మొత్తం ప్రభుత్వం నిలుస్తుందా కూలిపోతుందా అని ఆందోళన చెందుతుంటే… ప్రధాని మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నారు” అని అన్నారు.

ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారామ్ కేసరీ( Sitaram Kesri)దేవెగౌడ మధ్య ఉన్న విభేదాలను ఆయన “వింత పెళ్లి”గా పోల్చారు. “ఇది ఒక విచిత్రమైన పెళ్లి. ఇందులో వరుడు దేవెగౌడ… పెళ్లికూతురు తండ్రి సీతారాం కేసరి. మొదటి రోజు నుంచే ఇద్దరూ గొడవపడుతున్నారు. హనీమూన్ కూడా ప్రారంభం కాకముందే విడాకుల దశకు వచ్చేశారు.” ఈ వ్యాఖ్యలపై లోక్‌సభలో నవ్వులు పూశాయి. ఇంకా కాంగ్రెస్ “బయట నుంచి మద్దతు” ఇస్తున్న తీరును కూడా మహాజన్ సెటైర్ చేశారు. “బయట నుంచి మద్దతు అంటే… ఎవరో నిచ్చెన పట్టుకుని మీరు చివరి మెట్టుకి చేరుకునే వరకు సహాయం చేసి… అచ్చం ఆ సమయంలో నిచ్చెన లాగేసినట్టే. ఇది మద్దతులా కనిపించడం లేదు… ప్రభుత్వం కూల్చేందుకు చేసిన ఏర్పాటులా కనిపిస్తోంది.”

ఈ ప్రసంగం అప్పట్లో ఎంత వైరల్ అయిందో… ఇప్పుడు కూడా కూటమి రాజకీయాలపై చర్చ వచ్చినప్పుడల్లా అదే స్థాయిలో గుర్తు చేసుకుంటున్నారు.

అప్పటి రాజకీయ పరిస్థితి

1996 లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. అటల్ బిహారీ వాజ్ పేయి (Atal Bihari Vajpayee) నేతృత్వంలోని బీజేపీ( BJP) అతిపెద్ద పార్టీగా నిలిచినా మెజారిటీ నిరూపించలేక 13 రోజుల్లో ప్రభుత్వం పడిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ బయట నుంచి మద్దతు ఇవ్వడంతో దేవేగౌడ( HD Deve Gowda) నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడింది. కానీ తరువాత కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారామ్ కేసరీ (Sitaram Kesri) మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం సంక్షోభంలో పడింది. అదే సమయంలో మహాజన్ ఈ ప్రసంగం చేశారు.

ప్రస్తుత పరిస్థితి

తమిళనాడులో ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు కోసం జరుగుతున్న రాజకీయ సమీకరణాలు కూడా అప్పటి పరిస్థితులను గుర్తు చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అతిపెద్ద పార్టీ అధికారానికి దూరంగా ఉండటం… చిన్న పార్టీలు కీలకంగా మారటం… సిద్ధాంతపరంగా విభిన్నమైన పార్టీలు కలిసి రావడం… ఇవన్నీ మహాజన్ అప్పట్లో చెప్పిన “కూటమి రాజకీయాల విచిత్రం”ను మళ్లీ గుర్తు చేస్తున్నాయి.

Latest Articles

రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ… మోదీతో రేవంత్ ప్రత్యేక భేటీ

హైదరాబాద్ అభివృద్ధి ప్రాజెక్టులపై కీలక పరిణామాలకు రంగం సిద్ధమైంది. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Narendra Modi) హైదరాబాద్‌కు రానుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక వినతులు సమర్పించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్