2024 సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ఫలితాల షాక్ తర్వాత వైసిపికి మొదటిసారి విజయం దక్కింది. అధికార టిడిపి కూటమి పోటీ నుంచి తప్పుకున్న ఎన్నికల్లో వైసీపీ తన అభ్యర్థిని ఏకగ్రీవంగా గెలిపించుకొంది. ఈ విజయంతో వైసిపి శ్రేణులు.. సార్వత్రిక ఎన్నికల తర్వాత మొదటిసారి సంబరాలు చేసుకుంటున్నారు. విశాఖ లోకల్ బాడి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఉత్కంఠకు తెర పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. గతంలో వైసీపీ తరుపున విజయం సాధించిన వంశి కృష్ణ యాదవ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అంతే కాకుండా గత ఎన్నికల్లో ఆయన జన సేన తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక అనివార్యమైంది. అందులో భాగంగా ఈ నెల 30న ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఉప ఎన్నికను ప్రతి పక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిరియస్ గా తీసుకుంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి పక్ష వైసిపికే అత్యధిక ఓట్లు వున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 852 మంది ప్రజా ప్రతినిధులు వుంటే అందులో పదకొండు స్థానాలు ఖాళీలు వున్నాయి. వున్న 841 ఓట్లలో వైసిపికి 615, టిడిపి కూటమికి 215 ఓట్ల బలం వుంది. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి చిత్తుగా ఓడిపోవడం తో పాటు, అధికార టిడిపి కూటమి తిరుగులేని విజయంతో అధికార పీఠాన్ని దక్కించుకుంది. సార్వత్రిక ఎన్నికల తరువాత రాష్ట్రంలో జరుగుతున్న మొదటి mlc ఉప ఎన్నిక కావడంతో అధికార టిడిపి కూడా పోటీలో వుంటే ఎన్నిక అనివార్యం అని అంతా భావించారు.
Mlc ఎన్నిక నేపథ్యంలో వైసిపి ముందుగానే అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ప్రకటించింది. తమ స్థానాన్ని తిరిగి దక్కించుకోవడంలో భాగంగా వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి నియోజక వర్గాల వారీగా పార్టీ ప్రజా ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసారు. ఈ ఎన్నికల్లో తిరిగి వైసిపిని గెలిపించాలంటూ కోరారు. మరోవైపు mlc ఎన్నికలో కూటమి తరుపున పోటీపై ఏపీ సీఎం చంద్రబాబు మూడు పార్టీల నేతలతో మాట్లాడారు. మొదట్లో కూటమి తరుపున అభ్యర్థిని బరిలో నిలపాలని ప్రతిపాదనలు వచ్చాయి. అయితే కూటమికి ఓట్లు చాలా తక్కువగా వుండటం, వైసిపి ప్రజా ప్రతినిధులను తీసుకుంటే తప్ప ఎన్నికల్లో గెలిచే అవకాశం లేకపోవడంతో చివరకు పోటీ చేయకూడదని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. పోటీ నుంచి కూటమి తప్పుకున్నా, స్వతంత్ర అభ్యర్థి బరిలో వుండడంతో ఎమ్మెల్సీ ఎన్నికపై చివర వరకు ఉత్కంఠ నెలకొంది. ఇక నామినేషన్ల చివరి రోజు స్వతంత్ర అభ్యర్థి కూడా బరి నుంచి తప్పుకోవడం తో వైసిపి అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.
Mlc ఎన్నికలో వైసిపి విజయం ఆ పార్టీ నేతలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. గత సార్వత్రిక ఎన్నికల్లో YCP కేవలం 11 పదకొండు ఎమ్మేల్యే స్థానాల్లో మాత్రమే విజయం సాధించి ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక పోయింది. దీంతో YCP వర్గాలు తీవ్ర నిరాశలో వున్నాయి. అయితే తాజాగా విశాఖ లోకల్ బాడి ఎమ్మెల్సీ ఎన్నిక విజయంతో వైసిపి నేతల్లో ఎక్కడ లేని ఆనందం వ్యక్తం అవుతుంది.