సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా శ్రీనివాస మంగాపురం అనే సినిమాతో పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ విభిన్న ప్రేమకథా చిత్రం ఈ నెల 30న రిలీజ్ కానుంది. అయితే.. జయకృష్ణను ఆదరించాలని కోరుతూ.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఒకరి గురించి చెప్పడం మరిచిపోయారు మహేష్. ఇక అక్కడ నుంచి నిజంగానే మహేష్ మరిచిపోయారా..? లేక కావాలనే మరిచిపోయారా..? అనేది హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ.. ఆ వ్యక్తి ఎవరు..? అసలు.. సూపర్ స్టార్ ఫ్యామిలీ కల నెరవేరుతుందా..? లేదా..?
శ్రీనివాస మంగాపురం.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా వస్తారా..? రారా..? అనేది అభిమానుల్లో ఆసక్తిగా మారింది. మహేష్ బాబు వారణాసి షూటింగ్లో బిజీగా ఉండడం వలన శ్రీనివాస మంగాపురం ప్రీ రిలీజ్ వేడుకకు రావడం అనుమానమే అని ప్రచారం జరుగుతున్న టైమ్ లో ఒక వీడియో బైట్ రిలీజ్ చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ సినిమాలో నటించిన నటీనటులకు, దర్శకుడు అజయ్ భూపతి, నిర్మాతలు అశ్విని దత్, కిరణ్ తదితరులకు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ సినిమా హిట్టవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పారు మహేష్. అయితే.. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి చెప్పడం మహేష్ మరిచిపోయాడు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
మహేష్ బాబు, మోహన్ బాబు మధ్య బాండింగ్ లేదని కాదు.. మహేష్ చైల్డ్ ఆర్టిస్టుగా ఉన్నప్పుడే కొడుకు దిద్దిన కాపురం లాంటి సినిమాల్లో మోహన్ బాబు విలన్ గా నటించారు. కృష్ణతో కూడా అనుబంధం ఉండేది. అలాంటిది ఆయన గురించి చెప్పకపోవడం ఏమిటనే ప్రశ్న తలెత్తడం సహజం. కారణాలు ఏమైనా, ఏది ఎలా ఉన్నా ఈ మూవీకి మోహన్ బాబు క్యారెక్టర్ చాలా ప్లస్ అవుతుందనేది యూనిట్ నుంచి గట్టిగా వినిపిస్తున్న మాట. జయకృష్ణ ఘట్టమనేనికి గ్రాండ్ వెల్కమ్ వచ్చేలా టీమ్ చేస్తున్న ప్రమోషన్లు కొలిక్కి వస్తున్నాయి.
సీనియర్ హీరోయిన్ రవీనాటాండన్ కూతురు రశ తదాని ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమవుతోంది. లుక్స్ బాగానే ఉన్నాయి. ప్రేమకథనే ఫీలింగ్ కలిగించినా ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయట. ఫ్యాక్షనిజంతో పాటు ఎలేవేషన్లు, మాస్ అంశాలు అన్నీ పొందుపరిచి అజయ్ భూపతి కంప్లీట్ ప్యాకేజీగా రూపొందించారని సమాచారం. తండ్రి రమేష్ బాబు సోలో హీరోగా సక్సెస్ అవ్వాలని.. స్టార్ డమ్ సాధించాలని కృష్ణ కోరుకున్నారు. అది నెరవేరలేదు. రమేష్ బాబు తనయడు అయినా సక్సెస్ అవ్వాలి.. స్టార్ డమ్ సాధించాలి అనేది సూపర్ స్టార్ ఫ్యామిలీ కల. జయకృష్ణ.. చాలా హార్డ్ వర్క్ చేసాడు. ప్రమోషన్స్ లో కూడా అతని కష్టం కనిపిస్తుంది. మరి.. తండ్రి రమేష్ బాబు సాధించలేనిది.. తనయుడు జయకృష్ణ సాధిస్తాడేమో చూడాలి.


