తెలంగాణలో రాజీనామా రాజకీయం ముదురుతోంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్ పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. మాజీ మంత్రి హరీష్‌రావు రాజీనామా చేయాలని హస్తం నేతలు డిమాండ్ చేస్తోంటే.. మరోవైపు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయని సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని గులాబీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఇరు పార్టీ శ్రేణుల మధ్య ఫ్లెక్సీ వివాదం ముదురుతోంది. ఈ క్రమంలోనే సిద్దిపేటలో అర్థరాత్రి హైడ్రామా నెలకొంది.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు రాజీనామా చేయాలంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నేతలు. సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ పూజల హరికృష్ణ పేరుతో ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. ఇక ఫ్లెక్సీల ఏర్పాటుతో ఆందోళనకు దిగారు గులాబీ శ్రేణులు. గులాబీ నేతలు ఫ్లెక్సీలు చింపే ప్రయత్నం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ ఫ్లెక్సీ వివాదం రాజుకుంది. మరోవైపు క్యాంప్ ఆఫీస్‌పై దాడికి తెగబడ్డారు కాంగ్రెస్ కార్యకర్తలు. దీంతో ఘటనపై మండిపడ్డ హరీష్‌రావు ఇది అప్రజాస్వామికం.. ఆందోళనకరమన్నారు. పోలీసుల సమక్షంలోనే దాడులు జరగడం దారుణమని.. ఎమ్మెల్యే ఇంటిపైనే దాడి జరిగితే ప్రజల పరిస్థితి ఏంటని నిలదీశారు. ప్రభుత్వ ప్రాపర్టీని ధ్వంసం చేయడం సరికాదని.. ఘటనపై డీజీపీ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రుణమాఫీ అమలుపై గతంలో సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి హరీష్‌రావు మధ్య సవాళ్ల పర్వం సాగింది. అధికారంలోకి రాగానే రుణమాఫీ డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తామంటూ రేవంత్‌రెడ్డి మాట తప్పడంతో హరీష్‌రావు విమర్శలు గుప్పించారు. డెడ్‌లైన్ ప్రకారం పూర్తిస్థాయిలో 2 లక్షల రుణమాఫీ చేస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు హరీష్‌రావు. అయితే,.. ఇటీవల ఆగస్ట్ 15న రేవంత్ సర్కార్ 2 లక్షల రుణమాఫీ నిధులు విడుదల చేయడంతో హరీష్‌రావు రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీల రూపంలో టార్గెట్ చేశారు. ఈ వివాదంతో ఇరు పార్టీల మధ్య ఫ్లెక్సీ వార్ సాగుతోంది.