రాష్ట్ర వ్యాప్తంగా రైతులను అక్రమంగా అరెస్టు చేయడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ మాట నిలబెట్టుకోవాలని రైతులు చలో ప్రజాభవన్ కు పిలుపునిచ్చిన పాపానికి వారిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బుధవారం రాత్రి నుంచి రైతులను, రైతు సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టుచేసి పోలీసు స్టేషన్లలో నిర్బంధించడం దారుణమైన చర్య అన్నారు. వారేమైనా దొంగలా, ఉగ్రవాదులా అని ప్రశ్నించారు. గురువారం ఉదయం నుంచి కూడా అనేక చోట్ల అన్నదాతల ఇళ్లకు వెళ్లి వారిని అదుపులోకి తీసుకుంటున్నట్టు సమాచారం అందుతున్నదని చెప్పారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను ప్రభుత్వం ఇకనైనా ఆపాలన్నారు.
పోలీసుల నిర్బంధకాండతో రైతుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని వెల్లడించారు. అక్రమంగా నిర్బంధించిన రైతులందరినీ వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతులంటే ఇంత భయమెందుకు.. అన్నదాతలపై ఇంతటి నిర్బంధమెందుకని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే ఏకకాలంలో రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని హామీఇచ్చి మోసం చేసినందుకే రైతులు ఆందోళన పథం పట్టారని తెలిపారు. ఏ రాజకీయపార్టీతో సంబంధం లేకుండా తమకు తామే సంఘటితమై మొదలుపెట్టిన ఈ రైతు ఉద్యమం ఇంతటితో ఆగదన్నారు. రైతుల సంఘటిత శక్తి ముందు దగాకోరు కాంగ్రెస్ ప్రభుత్వం తలవంచక తప్పదని హెచ్చరించారు.