వైసీపీలో నంబర్ 2గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డికి ఉచ్చు భిగుస్తుందా? త్వరలో ఆయన అరెస్టు ఖాయమేనా? అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననక తప్పదు. పోలీసుల అదుపులో ఉన్న పోసాని కృష్ణ మురళి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంపై వైసీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. కూటమి ప్రభుత్వం ఇటీవల పలువురు వైసీపీ నేతలను టార్గెట్ చేసింది. ముఖ్యంగా వైసీపీ హయాంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిని లక్ష్యంగా చేసుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీ కీలక నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి, అతని కుమారుడు సజ్జల భార్గవ్‌రెడ్డి నెక్ట్స్ టార్గెట్ అనే ప్రచారం జరుగుతుంది.
పోసాని కృష్ణమురళి పోలీసులు విచారణలో పలు ఆశ్చర్యకరమైన విషయాలను వెలుగులోకి వచ్చాయి. స్వయంగా తనకు తాను అనుకుని.. కావాలని సీఎం చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల మీద దురుసుగా మాట్లాడలేదని.. సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడానని పోలీసులకు చెప్పారు. వాళ్లు సూచించినందునే సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కల్యాన్, కమ్మ సామాజిక వర్గంపై అసభ్యకరమైన భాషలో తిట్టానని పోసాని స్పష్టం చేశారు. వాళ్ల స్క్రిప్ట్ కారణంగానే విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడానని పోలీసుల ముందు తేల్చి చెప్పారు.
పోసాని కృష్ణమురళి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. పోలీసులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డిల అరెస్టు తప్పదని కూటమి పార్టీల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వీరిద్దరిని కటకటాల వెనక్కి నెట్టాలనే ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందులో భాగంగా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసును తెరపైకి తెచ్చారట. ఈ దాడి వెనుక సజ్జల ప్రమేయం ఉందని ఆయనపై కేసు నమోదు చేసి విచారణకు హాజరు కావాలని నోటీసులు కూడా జారీ చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇతర దేశాలకు పారిపోకుండా లుక్ అవుట్ నోటీసు కూడా జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్‌రెడ్డిని కూడా అరెస్టు చేసేందుకు ఇది వరకే రంగం సిద్ధం చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్, వైఎస్ వివేకా కుమార్తె సునీత, వైఎస్ షర్మిల మీద అనుచిత పోస్టులు పెట్టారనే కారణంతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రె రవీందర్ రెడ్డి ఇప్పటికే అరెస్టు అయ్యారు. అతను పోలీసులకు ఇచ్చిన వాగ్మూలం మేరకు భార్గవ్‌రెడ్డి మీద కేసులు నమోదు చేశారు. తాజాగా పోసాని ఇచ్చిన వాంగ్మూలంలో సజ్జల భార్గవ్‌రెడ్డి పేరు వెల్లడి కావడంతో ఇతని మీద పోలీసులు కేసు నమోదు చేసేందుకు రంగం చేశారు. ఈ నేపథ్యంలో తండ్రీ, కొడుకులైన సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్‌రెడ్డి అరెస్టు ఖాయమనే ఆందోళన వైసీపీ శ్రేణుల్లో నెలకొంది.
కాగా పోసాని కేసులో అన్నమయ్య జిల్లా పోలీసులు తమను కూడా అరెస్టు చేస్తారనే ఆందోళన ఉందని, దీంతో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. పోలీసుల విచారణలో పోసాని చెప్పిన వాంగ్మూలంలో పేర్కొన్న అంశాలు తప్ప ఈ నేరంలో మా పాత్ర ఉందనేందుకు ఆధారాలేమీ లేవు. ఇది రాజకీయ కక్షతో తమను ఇరికించాలనే ప్రయత్నమే అని పిటిషన్‌లో పేర్కొన్నారు. మేం ఎక్కడికీ పారిపోమని.. గుంటూరు, కడపలో తాము శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్నామని.. పోలీసుల విచారణకు సహకరిస్తామని చెబుతున్నారు.
ఏదేమైనా సజ్జల కుటుంబంలో రెండు అరెస్టులు జరిగితే అది వైసీపీలో భారీ కుదుపుకు దారి తీస్తుందనే చర్చ జరుగుతుంది. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.