ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు అసహనం వ్యక్తం చేశారు. సెషన్ మొదటి ఆరు ప్రశ్నలు వాయిదా వేయాల్సి వచ్చింది. మొదటి ప్రశ్నగా 7వ ప్రశ్న రావడంపై స్పీకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు ప్రశ్నలు వేసిన వైసీపీ సభ్యులు సభకు హాజరుకాలేదు. మూడు ప్రశ్నలను వాయిదా వేయాలని కోరారు కూటమి సభ్యులు. ఆరో ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు మంత్రి అనగాని సత్యప్రసాద్ సభలో లేరు. సమాధానాలు చెప్పాల్సిన మంత్రులు సభకు హాజురుకాకపోవడంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రశ్నలు వేసిన సభ్యులు సభకు ఎందుకు రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో ప్రొసీజర్ ప్రకారం నడుచుకోవాలని సూచించారు. మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష సభ్యులకు బాధ్యత ఉండాలి కదా అన్నారు. ప్రశ్నలు వేసినప్పుడు దాని సమాధానం కోసం సభకు రావాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. అవసరమనుకుంటే ఆ ప్రశ్నపై చర్చ కూడా జరగాలి కదా అని మంత్రి సత్యకుమార్ అన్నారు.
బడ్జెట్ సమావేశాలు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలను మొదలుపెట్టారు. సభలో తెల్ల రేషన్ కార్డుల జారీ, భూ వివాద అంశాలపై క్వశ్చన్ అవర్‌లో ముందుకు రానున్నాయి. అయితే సభలో ప్రశ్నలు వేసిన సభ్యులు సభకు హాజరుకాకపోవడంపై అయ్యన్న సీరియస్ అయ్యారు. దీంతో సెషన్‌లో మొదటి ఆరు ప్రశ్నలను వాయిదా వేయాలని కూటమి సభ్యులు కోరారు. ఇక ఆరో ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన మంత్రి కూడా అందుబాటులో లేకపోవడంతో స్పీకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా సభ్యులెవరూ సమయపాలన పాటించడం లేదని స్పీకర్ అయ్యన్న అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.