తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గ విభేదాలపై మీనాక్షీ నటరాజన్ దృష్టి పెట్టారా? ముందు పార్టీని చక్కదిద్ది.. తర్వాత ఇతర వ్యవహారాలపై ఫోకస్ చేయనున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ తనదైన శైలిలో కాంగ్రెస్‌లో దిద్దుబాటును మొదలుపెట్టారు. పార్టీలోని వర్గ విభేదాలకు అడ్డుకట్ట వేసి.. కాంగ్రెస్ క్యాడర్, నేతలను ఏకతాటిపైకి తేవడమే లక్ష్యంగా ఆమె గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్‌లో మెదక్ పార్లమెంటు స్థాయి కాంగ్రెస్ నేతల సమావేశం ఏర్పాటు చేశారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు మల్కాజిగిరి పార్లమెంటు స్థాయి కాంగ్రెస్ నేతల సమావేశం గాంధీ భవన్‌లో నిర్వహించనున్నారు.
ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని కాంగ్రెస్ నాయకులను గాంధీభవన్‌లో కూర్చోబెట్టి మీనాక్షీ నటరాజన్ మాట్లాడనున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుండగా.. ఇందులో ఆయా పార్లమెంటు స్థానాల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిన అభ్యర్థులను కూడా పిలిపిస్తున్నారు. ప్రతీ ఒక్కరికీ ఈ సమావేశంలో మాట్లాడే అవకాశం ఇస్తారట. అంతే కాకుండా నేతల మధ్య ఉన్న అభిప్రాయబేధాలను కూడా అడిగి తెలుసుకొని.. అక్కడే పరిష్కరించే అవకాశం ఉందని తెలుస్తుంది.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే నేతలను, పార్టీపై విమర్శలు చేసే నేతలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని మీనాక్షి నటరాజన్ తేల్చి చెప్పారు. చెప్పడమే కాదు.. తీన్మార్ మల్లన్న విషయంలో వెంటనే నిర్ణయం తీసుకొని మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ గీసిన గీతను దాటితే.. ఎంతటి వారైనా ఊరుకునేది లేదనే సంకేతాలను పంపారు మీనాక్షీ నటరాజన్. ఎలాంటి వర్గపోరుకు తావు లేకుండా, కలిసికట్టుగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్ క్యాడర్‌ను సంసిద్ధం చేయడమే టార్గెట్‌గా ఆమె పావులు కదుపుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న వర్గపోరుపై మీనాక్షి సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది.
మంగళవారం మెదక్ పార్లమెంటు స్థాయి కాంగ్రెస్ నేతల సమావేశంలోనూ వర్గపోరుపైనే ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉంది. కొన్నాళ్లుగా పటాన్ చెరు కాంగ్రెస్ ఇంఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున పటాన్‌చెరు నుంచి గెలిచారు. అయితే కాంగ్రెస్ గెలవగానే ఆయన హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. పటాన్‌చెరు అసెంబ్లీ స్థానం నుంచి గతంలో పలుమార్లు పోటీ చేసి కాటా శ్రీనివాస్ గౌడ్ ఓడిపోయారు. అయితే మొదటి నుంచీ ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నారు. పటాన్‌చెరు కాంగ్రెస్‌లో ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి, కాటా శ్రీనివాస్ గౌడ్ రెండు వర్గాలను పెంచి పోషిస్తున్నారు. దీనిపై ఆ ఇద్దరు నేతలకు మీనాక్షి నటరాజన్అల్టిమేటం ఇచ్చే అవకాశం ఉంది.
పటాన్ చెరులోని వర్గ విభేదాలు రాష్ట్రమంతటా చర్చనీయాంశం అవుతున్నాయి. ఇక్కడ మూడు వర్గాల మధ్య నిత్యం ఘర్షణ వాతావరణం నెలకొని ఉంటుంది. అందుకే వర్గ విభేదాలను ఆపాలని మీనాక్షీ నటరాజన్ హెచ్చరించే అవకాశం ఉంది. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లే వారికి కాంగ్రెస్‌లో అవకాశాలు ఉంటాయని ఇప్పటికే ఆమె పలు సమావేశాల్లో చెప్పారు. ఇప్పుడు కాటా శ్రీనివాస్, నీలం మధు, గూడెం మహిపాల్ రెడ్డి విషయంలో కూడా ఇదే పద్దతిని అనుసరించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
పటాన్ చెరు కాంగ్రెస్‌లో నెలకొన్న విభేదాలపై టీపీసీసీ చేసిన అంతర్గత విచారణ నివేదికను మీనాక్షీ నటరాజన్‌కు అందించారు. ఈ నివేదికలోని అంశాల ఆధారంగా మహిపాల్ రెడ్డి, కాటా శ్రీనివాస్‌లకు మీనాక్షి కౌన్సెలింగ్ చేయనున్నట్లు చర్చ జరుగుతోంది. ఏదేమైనా మీనాక్షీ నటరాజన్ ఇంచార్జిగా వచ్చిన తర్వాత కాంగ్రెస్‌లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మరి ఈ వర్గ విభేదాలు పూర్తిగా సమసిపోతాయా? లేదంటే తాత్కాలికమేనా అనేది వేచి చూడాలి.