ఏపీలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలను టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కూటమి మద్దతిచ్చిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రత్యేకంగా కొంతమంది నేతలను చంద్రబాబు నియమించారు. పోలింగ్ కు ముందు, తర్వాత కూడా ఆ నేతలతో చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ క్రమంలోనే కూటమి బలపరిచిన అభ్యర్థులు విజయ ఢంకా మోగిస్తున్నారు. గుంటూరు-కృష్ణా జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆలపాటి రాజా ఘన విజయం సాధించారు.
ప్రత్యర్థి పార్టీపై ఆట కాదు… వేట కొనసాగుతుందని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించారు. పట్టభద్రులకు ఉపాధ్యాయ సంఘాలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తానని హామీ ఇచ్చారు. పట్టభద్రులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చుతానని ధీమా వ్యక్తం చేశారు.
ఆలపాటి రాజా స్వతంత్రతో మాట్లాడుతూ.. “మంచి పాలనకి సంకేతంగా భావిస్తాను. అమరావతి పూర్తి కావాలని.. పోలవరం త్వరగా పూర్తి కావాలని , వెళ్లిపోయిన పరిశ్రమలను తీసుకొచ్చి ఉపాధి కల్పించి, ఎన్నికల మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పామో.. వాటిని సఫలీకృతం చేయడానికి జరిగిన ఎన్నికలుగా భావిస్తాను. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలైంది. గత ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా చేసిన అప్పులను కూడా 29వేల కోట్ల రూపాయలను తీర్చడం మా బాధ్యతగా భావించాం. గత ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులను ఇవ్వలేదు. మా ప్రభుత్వం బకాయిలను తీర్చే కార్యక్రమం చేపట్టింది. ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రజలు ఇబ్బందులు పడకూడదని గత ప్రభుత్వ తప్పిదాలను మా మీద వేసుకుని అమలు చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీలో ఆట ఉండదు.. వేట మాత్రమే ఉంటుంది.. అది కూడా రాజకీయ ప్రత్యర్థులు, ప్రతిపక్షాల మీద ఉంటుంది”.. అని ఆలపాటి రాజా అన్నారు.
తొలి రౌండ్ నుంచే ఆలపాటి రాజా మెజారిటీ దిశగా దూసుకుపోయారు. 7వ రౌండ్ పూర్తయ్యేసరికి ఆలపాటి రాజాకు 1,18,070 ఓట్లు వచ్చాయి. దీంతో, మూడు సార్లు ఎమ్మెల్సీగా గెలిచిన కేఎస్ లక్ష్మణరావుకు ఘోర పరాజయం తప్పలేదు. జగన్ కు సన్నిహితుడిగా పేరున్న లక్ష్మణరావుకు ఈ ఎన్నికల్లో వైసీపీ పరోక్ష మద్దతునిచ్చింది. మొత్తం 2,41,873 ఓట్లు పోలవ్వగా… 21,577 ఓట్లు చెల్లలేదు. దీంతో, రాజాను ఎన్నికల అధికారులు విజేతగా ప్రకటించారు.
7 రౌండ్లు ముగిసేసరికి ఆలపాటి రాజా 67,252 ఓట్ల మెజారిటీ సాధించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా పోటీ చేయలేదు. పొత్తులో భాగంగా తెనాలి నియోజకవర్గం నాదెండ్ల మనోహర్ కు కేటాయించాల్సి వచ్చింది. దీంతో, రాజాను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా చంద్రబాబు నిలబెట్టారు.