ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో SRSP,కడెం, ఎల్లంపల్లి, జురాల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టుకు 77 వేల 442 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు 6 గేట్లు ఎత్తి 47 వేల 580 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. మొత్తం అవుట్ ఫ్లో 47 వేల 647 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 693.72 అడగులుగా ఉంది. 3.495 టీఎంసీ సామర్థ్యానికి గానూ 2.12 TMCల నీరు నిల్వ ఉంది.
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 78 వేల 034 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. ప్రాజెక్టు నీటిమట్టం 145.58 మీటర్లకు, నీటి నిల్వ 13 టీఎంసీలకు చేరింది. నంది పంప్‌హౌస్ ద్వారా 15,270 క్యూసెక్కులు, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌కు 275 క్యూసెక్కులు కలిపి మొత్తం 16,025 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు.
ఎస్సారెస్పీలోకి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జలాశయం నీటిమట్టం 1,065 అడుగులు కాగా.. నీటి నిల్వ 17 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టులోకి 9,240 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. కాకతీయ కాలువకు 330 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
కృష్ణాబేసిన్‌లోని జూరాల ప్రాజెక్ట్ 10గేట్లు ఎత్తివేశారు. జూరాల ఇన్‌ఫ్లో 53వేల క్యూసెక్కులు కాగా..ఔట్ ఫ్లో 84 వేల 790 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం 317.12మీటర్లకు చేరుకుంది. జూరాల పూర్తిస్తాయి నీటి సామర్థ్యం 9.657టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 6.95టీఎంసీలకు చేరింది. జూరాలలో 10యూనిట్లలో 395 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.


