టీడీపీలో చంద్రబాబు జమానా ముగిసిందా?… నారా లోకేశ్ శకం మొదలయ్యిందా?

ఏపీ రాజకీయాల్లో అధికార తెలుగుదేశం పార్టీ తీసుకున్న తాజా నిర్ణయం సరికొత్త చర్చకు దారి తీసింది. ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో పార్టీ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్లను పక్కనపెట్టి, యువ నాయకత్వానికి పెద్దపీట వేసింది. ఈ ఎంపికను నిశితంగా గమనిస్తే పార్టీలో నారా లోకేష్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ కోసం కష్టకాలంలో తెరవెనుక పనిచేసిన వారికి, లోకేష్ కోర్ టీమ్ సభ్యులకు పెద్దల సభకు వెళ్లే అవకాశం దక్కింది. ఇంతకీ ఈ తాజా నిర్ణయంతో టీడీపీలో చంద్రబాబు జమానా ముగిసి లోకేష్ శకం మొదలైనట్లేనా? దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకున్న సీనియర్ నేతల భవిష్యత్తు ఇక ప్రశ్నార్థకమేనా?

తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలకు ఎంపిక చేసిన ముగ్గురు అభ్యర్థుల పేర్లు రాష్ట్ర రాజకీయాల్లో ఒక స్పష్టమైన సంకేతాన్ని పంపించాయి. సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లకు పెద్దల సభకు వెళ్లే అవకాశం కల్పించడం ద్వారా పార్టీ ఒక సరికొత్త విధానానికి తెరతీసింది. ఈ ముగ్గురు నేతలు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు అత్యంత సన్నిహితులు కావడం విశేషం. టీడీపీలో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యువతరాన్ని క్రియాశీలక పదవుల్లోకి తీసుకురావాలని నాయకత్వం ఒక బలమైన నిర్ణయానికి వచ్చింది. ఇది పూర్తిగా నారా లోకేష్ ఎంపిక చేసిన టీం అని పార్టీ శ్రేణులు బలంగా విశ్వసిస్తున్నాయి. దీన్నిబట్టి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు జమానా నెమ్మదిగా ముగుస్తోందని, ఇకపై లోకేష్ హవానే నడవనుందని స్పష్టమవుతోంది. సామాజిక సమీకరణాలను కూడా పార్టీ పక్కాగా బేరీజు వేసుకుంది. సానా సతీష్ ద్వారా కాపు సామాజిక వర్గానికి, భాష్యం రామకృష్ణ ద్వారా కమ్మ సామాజిక వర్గానికి, అలాగే చింతకాయల విజయ్ ద్వారా తూర్పు కాపు సామాజిక వర్గానికి పార్టీ అత్యున్నత ప్రాధాన్యత కల్పించింది.

రాజ్యసభకు ఎంపికైన వారిలో మొదటి వ్యక్తి సానా సతీష్. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన ఈ ప్రముఖ పారిశ్రామికవేత్త నారా లోకేష్ కోర్ టీమ్‌లో అత్యంత కీలక సభ్యుడు. 2024 డిసెంబర్‌లో ఏపీలో ఖాళీ అయిన ఒక స్థానానికి సానా సతీష్‌ను పార్టీ ముందుగా ఎంపిక చేసింది. అయితే ఆ స్థానం పదవీకాలం కేవలం రెండేళ్లు మాత్రమే ఉండటంతో.. ఇటీవలే పదవీ కాలం ముగిసిపోయింది. పార్టీ కోసం ఆయన చేసిన సేవలను గుర్తించి ఇప్పుడు ఆయన్ను మళ్లీ పూర్తి స్థాయి కాలానికి రెన్యువల్ చేసింది. గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించడం వెనుక తెరవెనుక ఉండి సానా సతీష్ ఎంతో శ్రమించారు. దానికి తోడు నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రను క్షేత్రస్థాయిలో విజయవంతం చేయడంలో, ఆర్థికంగా, వ్యూహాత్మకంగా అండగా నిలవడంలో సతీష్ పాత్ర మరువలేనిది. ఈ అంకితభావాన్ని, నిరంతర శ్రమను పరిగణనలోకి తీసుకున్న నాయకత్వం ఆయనకు పెద్దల సభలో మరోసారి చోటు కల్పించి సముచితంగా గౌరవించింది.

ఇక రాజ్యసభకు ఎంపికైన రెండవ అభ్యర్థి భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ. గుంటూరు జిల్లాకు చెందిన రామకృష్ణ వెనుక నుంచి తెలుగుదేశం పార్టీకి కొండంత అండగా నిలిచారు. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పార్టీ కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు, రామకృష్ణ వ్యాపారాలపై అనేక రకాల వేధింపులు జరిగినప్పటికీ ఆయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లూ ఒక బలమైన వెన్నెముకలా నిలబడ్డారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని బలంగా కోరుకున్నారు. అయితే రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆ టికెట్ ఆయనకు దక్కలేదు. అయినప్పటికీ ఏమాత్రం అసంతృప్తి చెందకుండా, సాంకేతికంగా, ఆర్థికంగా పార్టీ విజయానికి అమూల్యమైన సాయం అందించారు. లోకేష్ కు అత్యంత ఆప్తుడిగా మెలిగిన రామకృష్ణ అంకితభావాన్ని గుర్తించిన చంద్రబాబు నాయుడు, ఆయనకు ఇప్పుడు నేరుగా రాజ్యసభ స్థానాన్ని బహుమతిగా అందించారు.

మూడవ అభ్యర్థిగా ఎంపికైన చింతకాయల విజయ్ గురించి పార్టీ వర్గాలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుత శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడైన విజయ్, చాలా చిన్న వయసులోనే ఐటీడీపీ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నారు. గత ఐదేళ్ల ప్రభుత్వంలో సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన డిజిటల్ పోరాటం అనన్య సామాన్యమైనది. ఐటీడీపీ ఇన్‌ఛార్జిగా ఉంటూ ప్రభుత్వ తప్పులను నిలదీసినందుకు ఆయనపై అనేక అక్రమ కేసులు నమోదయ్యాయి. పోలీసుల దాడులు జరిగినప్పటికీ ఏమాత్రం బెదరకుండా తన డిజిటల్ సైన్యం ద్వారా పార్టీ గళాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. గత లోక్‌సభ ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ టికెట్ ను విజయ్ ఆశించినప్పటికీ, పొత్తు ధర్మంలో భాగంగా ఆ సీటును బీజేపీకి త్యాగం చేయాల్సి వచ్చింది. సీటు రాకపోయినా నిరాశపడకుండా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం తన వంతు కృషి చేశారు. లోకేష్ అడుగుజాడల్లో నడుస్తూ, పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన ఈ యువ కిశోరానికి పెద్దల సభలో అవకాశం దక్కడం పార్టీ డిజిటల్ సైన్యానికి ఒక గొప్ప బూస్ట్‌ను ఇచ్చింది.

రాజ్యసభ అంటేనే ఒకప్పుడు సీనియర్లకు, అనుభవజ్ఞులకు రిజర్వ్ చేసిన పెద్దల సభ అనే భావన ఉండేది. కానీ తాజా ఎంపికలతో ఆ సంప్రదాయానికి బ్రేక్ పడింది. పార్టీ కోసం దశాబ్దాలుగా కష్టపడిన సీనియర్ నేతలకు ఈ పరిణామం తీవ్ర ఆశాభంగాన్ని మిగిల్చింది. 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు క్యాబినెట్‌లో కూడా సీనియర్లకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ధూళిపాళ్ల నరేంద్ర, యనమల రామకృష్ణుడు, పరిటాల సునీత, ప్రత్తిపాటి పుల్లారావు లాంటి హేమాహేమీలకు మంత్రి పదవులు దక్కలేదు. పోనీ ఇప్పుడు రాజ్యసభలో అయినా అవకాశం వస్తుందని కంభంపాటి రామ్మోహన్ రావు, వర్ల రామయ్య లాంటి నేతలు చివరి నిమిషం వరకు ఆశలు పెట్టుకున్నారు. సామాజిక వర్గం, సీనియారిటీ, లాయల్టీ పేర్లతో అధినేత వద్ద ముమ్మర ప్రయత్నాలు చేశారు. కానీ నాయకత్వం మాత్రం పూర్తిగా కొత్త వారికి, యువతకే పట్టం కట్టడంతో పాతతరం నాయకుల్లో తీవ్ర నైరాశ్యం అలుముకుంది. తాము ఇన్నాళ్లు చేసిన సేవలకు ఇక భవిష్యత్తులోనూ తగిన గుర్తింపు రాదనే ఒక చేదు వాస్తవాన్ని సీనియర్ నేతలు జీర్ణించుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీలో అధికారికంగా యువ నాయకత్వ శకం మొదలైందనేందుకు ఈ పరిణామాలే సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

Latest Articles

పెళ్లికి ముందు శారీరక సంబంధం ఉంటే క్యారెక్టర్‌ను తప్పుబట్టలేం- సుప్రీంకోర్టు

పెళ్లికి ముందు లైంగిక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పెళ్లికి ముందు పరస్పర అంగీకారంతో..శారీరక సంబంధం ఉంటే క్యారెక్టర్‌ను తప్పుబట్టలేమని స్పష్టం చేసింది. ప్రేమించిన ప్రతి బంధం పెళ్లి వరకు వెళ్లలేకపోవచ్చని.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్