GHMCలోని పలు విభాగాలపై విజిలెన్స్ విచారణ జరిగే అవకాశం ఉందా..? జనన, మరణ ధృవీకరణ పత్రాలు మొదలుకొని ఇంజినీరింగ్ పనుల వరకు పలు అంశాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై నూతన కమిషనర్ ఇలంబర్తి స్పెషల్‌గా ఫోకస్ చేశారా..? అంటే అవునన్న వాదన విన్పిస్తోంది. బల్దియాలో ఈ పరిస్థితి ఎందుకు తలెత్తింది..? ఏం జరిగింది..? దీనిపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్..! కోటి మందికి పైగా జనాభాకు సేవలు అందిస్తున్నపెద్ద సంస్థ. ఇంటి ముందు ఉన్న వీధి దీపాల మొదలు జనన, మరణ ధృవీకరణ పత్రాల వరకు వందలాది అంశాల్లో సేవలందిస్తోంది జీహెచ్‌ఎంసీ.
కోటి మందికి పైగా ప్రజలకు.. వందలాది సేవలు అందిస్తున్న జీహెచ్‌ఎంసీలోని కొన్ని విభాగాల్లో అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించారు నూతన కమిషనర్ ఇలంబర్తి. ఇకపై జరిగే ప్రతి చెల్లింపుల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని జోనల్ కమిషనర్లకు, హెచ్‌ఓడీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇక.. స్వయంగా తన దగ్గరకు వస్తున్న బిల్లుల విషయంలో అన్ని వివరాలు తెలుసుకొని మరీ సంతకాలు చేస్తున్నట్లు సమాచారం.
కొంత మేర గందరగోళం, అయోమయంగా ఉన్న ఫైళ్ల విషయంపై క్లారిటీ ఇవ్వాలని వెనక్కు తిప్పి పంపుతున్నట్లు తెలుస్తోంది. కేవలం ఇదే కాదు.. నాలుగైదు ఏళ్ల క్రితం టెండర్లు పూర్తై పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులు చేయకుండా గడువు పూర్తైన తర్వాత బిల్లులు పెట్టిన వాళ్లు, అసంపూర్తిగా పనులు చేసి బిల్లుల కోసం ఎదురుచూస్తున్న వాళ్ల ఫైళ్లపై మరింతగా దృష్టి పెట్టారు కమిషనర్ ఇలంబర్తి.
చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లుల విషయంలో జోనల్ కమిషనర్లు పూర్తిస్థాయిలో పనులను తనిఖీ చేసిన తర్వాతే… అన్నీ క్లియర్ చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు జీహెచ్‌ఎంసీ కమిషనర్. కోటి రూపాయల కంటే ఎక్కువ చెల్లింపులు చేయాల్సి ఉన్న వాటి విషయంలో మరింత శ్రద్ధగా నడుచుకోవాలని ఆదేశించారు. ఇలా ఒకదాని వెంట మరోటిగా ఆదేశాలు జారీ చేయడంతో ఓ దశలో కొంతమంది కాంట్రాక్టర్లు జీహెచ్‌ఎంసీ ముందు ఆందోళనకు సైతం దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
జీహెచ్‌ఎంసీ చేసే ముఖ్యమైన పనుల్లో ప్రధానమైనది బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీ. దీనిపైనా ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్టిఫికెట్లు జారీ చేసే క్రమంలో అవకతవకలకు పాల్పడడంతో పలువురు ఏసీబీ అధికారులకు పట్టుబడడం కలకలం రేపుతోంది. ఇలాంటివి గుర్తించిన కమిషనర్.. ఇందులో పని చేసే ఉద్యోగులు, అధికారులపై ప్రత్యేక నివేదిక ఇవ్వాలంటూ స్టేట్ విజిలెన్స్ విభాగానికి లేఖ రాశారు. ఇప్పటికే కొంత మందిపై నివేదిక కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి చార్మినార్ జోన్‌లో ఉన్న కొన్ని సర్కిళ్లలో జనన, మరణ ధృవపత్రాల జారీలో అక్రమాలు ఎక్కువగా జరిగినట్లు తెలుస్తోంది.
నిబంధనలకు విరుద్దంగా సంబంధిత అధికారి సర్టిఫికెట్లు జారీ చేశారని తేలడంతో ఇప్పటికే ఆయనకు మెమో జారీ చేసినట్లు తెలుస్తోంది. ఓవైపు ఆ అధికారి వివరణ కోరుతూనే ఆయన జారీ చేసిన ఇతర పత్రాలను సైతం పరిశీలించాలంటూ విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించినట్లు సమాచారం. మొత్తంగా ఎంత కాలం నుంచి ఆ అధికారి అక్కడ పనిచేశారు.. ఎన్ని సర్టిఫికెట్లు జారీ చేశారన్న దానిపై లెక్కలు తీస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.
టౌన్ ప్లానింగ్ విభాగం విషయంలో ఫిర్యాదులు ఎక్కువగా వస్తూ ఉండడంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు జీహెచ్‌ఎంసీ కమిషనర్. ప్రొసీజర్ ప్రకారం పని చేయని అధికారులకు మెమోలు జారీ చేయాలని టౌన్ ప్లానింగ్ చీఫ్‌కు ఆదేశాలు జారీ చేశారు కమిషనర్ ఇలంబర్తి. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంతోపాటు జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారులపైనా నిఘా పెట్టారు. దీంతో.. కొందరు కింది స్థాయి సిబ్బంది తమ విభాగంలోని అధికారులపైనా విచారణ చేయిస్తే బాగుంటుందని చర్చించుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది.