విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.11 వేల 400 కోట్ల ప్యాకేజీని అమలు చేసే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం జిల్లా బిజెపి కార్యాలయంలో మీడియాతో జరిగిన చిట్ చాట్‌లో కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ప్యాకేజీ ప్రకటించాక ఉత్పత్తి పెరిగిందని, 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి తీసుకొచ్చే విధంగా పనిచేస్తున్నామన్నారు.
అంతేకాకుండా మార్చి 31 నాటికి వీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇప్పటివరకు వీఆర్‌ఎస్‌కు 1,141 మందిని అర్హులుగా నిర్ణయించడం జరిగిందన్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. మిగిలిన వారికోసం కమిటీ ఏర్పాటు చేశామని, రేపటిలోగా మొదటి విడతగా 200 మందికి వీఆర్‌ఎస్‌ను మంజూరు చేస్తున్నామని వెల్లడించారు.
జాతీయ రహదారి 165 విస్తరణలో భాగంగా ఆకివీడు నుండి దిగమర్రు బైపాస్ రోడ్డు వరకు ఎలైన్‌మెంట్ రూపొందించడం జరిగిందన్నారు. సుమారు 580 నుండి 590 ఎకరాల వరకు భూ సేకరణ చేయడానికి ఇప్పటికే రూ.1200 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని వెల్లడించారు. ఒక్క ఇల్లు కూడా తొలగించకుండా నూతన అలైన్‌మెంట్ ప్రకారం జాతీయ రహదారిని నిర్మిస్తామని తెలిపారు కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ.