బీఆర్ఎస్‌లో హరీశ్ రావుకు ప్రాధాన్యత పెరుగుతోందా? భవిష్యత్‌లో పార్టీని నడిపించే అవకాశం కూడా హరీశ్ రావుకు దక్కనుందా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. చాన్నాళ్ల అజ్ఞాత వాసం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు వచ్చారు. తెలంగాణ భవన్‌లో పార్టీ రజతోత్సవాల నిర్వహణ, సభ్యత్వ నమోదు ఇతర ముఖ్య అంశాలపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కాగా, ఈ సమావేశంలో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే సభ్యత్వ నమోదు కార్యక్రమం బాధ్యతలను హరీశ్ రావుకు ఇచ్చారు. ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి.. బీఆర్ఎస్ ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత.. సీనియర్ నాయకుడు,మాజీ మంత్రి హరీశ్ రావు కేవలం మెదక్ జిల్లాకే పరిమితం అయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే రాజకీయం చేస్తూ.. అక్కడే ఉండిపోయారు. కేటీఆర్ ఒక సారి అమెరికా వెళ్లినప్పుడు తప్ప.. హరీష్ రావు అసలు హైదరాబాద్ వేదికగా కార్యక్రమాలు చేపట్టలేదు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడైన కేటీఆర్ అంతా తానై వ్యవహరిస్తున్నారు. ఇది హరీశ్ రావు అనుచరులను కూడా ఇబ్బంది పెట్టింది. పార్టీలో ముఖ్య బాధ్యతలు ఇస్తే హరీశ్ ఏకుకు మేకవుతాడనే పక్కన పెట్టినట్లు చర్చ కూడా జరిగింది.
కాగా.. అకస్మాతుగా బయటకు వచ్చిన కేసీఆర్.. హరీశ్ రావుకు కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీ బలోపేతం కోసం చేపట్టే సభ్యత్వ నమోదు బాధ్యతలు హరీశ్ చేతిలో పెట్టారు. సభ్యత్వ నమోదు అనేది ఏ పార్టీకైనా కీలకమే. పైగా దీన్ని పర్యవేక్షించడం అంటే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులపై పట్టు పెంచుకోవడమే. మరి తెలిసీ తెలిసీ కేసీఆర్.. హరీశ్‌కే ఈ బాధ్యతలు ఎందుకు ఇచ్చారనేది ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతోంది. కొన్నాళ్ల క్రితం ఏపీలో టీడీపీ సభ్యత్వ నమోదు చేపట్టింది. దీని బాధ్యతలు నారా లోకేశ్ పర్యవేక్షించారు. ఇప్పుడు బీఆర్ఎస్‌లో సభ్యత్వ నమోదు బాధ్యతలను కేటీఆర్‌కు ఇస్తారని అందరూ భావించారు. కానీ ఆయనను కేవలం రజతోత్సవాలకే పరిమితం చేసి.. హరీశ్ రావుకు కీలక సభ్యత్వ నమోదు బాధ్యతలు ఇచ్చారు.
ఇటీవల కేసీఆర్ ఇస్తున్న ఆదేశాలను చూస్తే హరీష్ రావుకు అనూహ్య ప్రాధాన్యత లభిస్తున్నట్లు అర్థం అవుతోంది. ఏ విషయం అయినా ముందుగా హరీశ్‌కే బాధ్యతలు అప్పగించడంతో తరచూ మీడియాలో హైలెట్ అవుతున్నారు. ప్రతీ విషయంలోనూ హరీష్ దూకుడుగానే ఉంటున్నారు. కేసీఆర్ ఒక్క సారిగా హరీష్ కు ప్రాధాన్యం పెంచడం బీఆర్ఎస్ వర్గాల్లోనూ కాస్త ఆశ్చర్యకరంగానే ఉంది. గతంలో రెండో సారి బీఆర్ఎస్ గెలిచిన తర్వాత హరీష్ రావు అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు. మంత్రి పదవి వస్తుందో రాదో తెలియని పరిస్థితి. నెలల తరబడి ప్రగతి భవన్ నుంచి ఆయనకు పిలుపులు వచ్చేవి కావు. కానీ ఇప్పుడు ఒక్క సారిగా సీన్ మారిపోయింది.
బీఆర్ఎస్‌కు సంబంధించి పార్టీ వ్యవహారాలు మొత్తం కేటీఆర్ చూసుకుంటున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మొత్తం ఆయన చేతుల మీదుగానే నడుస్తోంది. రోజుకు రెండు, మూడు చోట్ల ప్రసంగిస్తున్నారు. జిల్లాలు తిరుగుతున్నారు. అయితే పార్టీకి .. కేటీఆర్ కు అనుకున్నంతగా మైలేజీ రావడం లేదన్న అభిప్రాయం బలంగా ఉంది. అందుకే కేసీఆర్.. హరీష్ రావుకు ప్రాధాన్యం పెంచుతున్నారని భావిస్తున్నారు. ఈ అవకాశాన్ని హరీష్ ఉపయోగించుకుంటున్నారు. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్‌లో బీఆర్ఎస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహిస్తామని కేసీఆర్ చెప్పారు. ఆ సమయంలోనే మరో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా హరీశ్‌ను చేస్తారనే టాక్ వినిపిస్తుంది.
హరీశ్ రావు, కేటీఆర్ మధ్య విభేదాలు లేకుండా ఒక ఫార్ములాను కేసీఆర్ రూపొందించారని అంటున్నారు. హరీశ్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించాలని.. భవిష్యత్‌లో అధికారంలోకి వస్తే కేటీఆర్‌ను సీఎం చేయాలనేదే ఆ ఫార్ములాగా చెప్పుకుంటున్నారు. మరి హరీశ్ రావు చేతిలో పార్టీ మొత్తాన్ని పెడితే భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ప్రస్తుతం హరీశ్ రావుకు పెరుగుతున్న ప్రాధాన్యత చూసి అతని అనుచరులు మాత్రం ఖుషీ అవుతున్నారు. మరి కేసీఆర్ మనసులో ఏముందు కొన్నాళ్లు వేచి చూస్తే కానీ అర్థం కాదు.