రిషబ్ శెట్టి.. ఒకప్పుడు శాండిల్ వుడ్ కే పరిమితమైన హీరో. కానీ.. కాంతర మూవీతో తన మార్కెట్ పెరిగింది. పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అందుకనే.. రెమ్యూనరేషన్ బాగానే డిమాండ్ చేస్తున్నాడని ఆమధ్య వార్తలు వచ్చాయి. ఇప్పుడు రిషబ్ శెట్టితో భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీస్తూ.. రిస్క్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. నిజంగానే రిస్క్ చేస్తున్నారా..? అసలు.. రిషబ్ చేస్తున్న భారీ బడ్జెట్ మూవీ కథ ఏంటి..? ఆ మూవీ డైరెక్టర్ ఎవరు..? ఎప్పుడు రిలీజ్ కానుంది..?
రిషబ్ శెట్టి.. కాంతార ముందు చిన్న సినిమాలు చేసేవారు. తన మార్కెట్ చాలా అంటే చాలా చిన్నది. అయితే.. ఒకే ఒక్క సినిమా కాంతార అతని జీవితాన్ని మార్చేసింది. అది కూడా చిన్న సినిమానే అయినా.. పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ గా నిలవడంతో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. దాదాపుగా 400 కోట్లు కలెక్షన్లు రాబట్టడంతో రిషబ్ శెట్టి పేరు మార్మోగిపోయింది. కాంతార తర్వాత కొంత గ్యాప్ తీసుకుని కాంతార ఛాప్టర్ 1 తీస్తే.. అది కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. దీంతో రిషబ్ శెట్టి క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం రిషబ్ శెట్టి.. హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ మూవీలో నటిస్తున్నారు. ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న జై హనుమాన్ ఇటీవల సెట్స్ పైకి వచ్చింది.
రిషబ్ ప్రధాన పాత్రలో ఛత్రపతి శివాజీ సినిమాని ప్రకటించారు. మరాఠా యోధుడు శివాజీ పై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఇటీవలే రితేశ్ దేశ్‌ముఖ్ సైతం స్వీయ దర్శకత్వంలో శివాజీ మీద సినిమా చేశాడు. అయితే.. శివాజీ కథను భారీ బడ్జెట్ తో తీయబోతున్నారని.. ఈ సినిమాకి 500 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలా వార్తలు వచ్చినప్పటి నుంచి రిషబ్ తో రిస్క్ చేస్తున్నారని.. ఆల్రెడీ శివాజీ పై చాలా సినిమాలు రావడంతో.. ఇప్పుడు మళ్లీ తీస్తే అంతగా వర్కవుట్ కాకపోవచ్చని ప్రచారం జరుగుతుంది.
ఈ భారీ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు సందీప్ సింగ్ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించనున్నారు. ఈ భారీ చిత్రాన్ని ఎమెంగో స్టూడియోస్, లెజెండ్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. వచ్చే సంవత్సరంలో షూటింగ్ స్టార్ట్ చేసి 2028లో పార్ట్-1ను, 2029లో పార్ట్-2ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రిషబ్ కి ఉన్న క్రేజ్, మార్కెట్.. ఈ కథకు ఉన్న పోటెన్షియాలిటీ దృష్ట్యా ఈ సినిమాకి అంత బడ్జెట్ పెడుతున్నారట. ఈ మూవీ వర్కవుట్ అయితే.. ఒక్కో పార్ట్ 1000 కోట్లు కలెక్ట్ చేయచ్చు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరి.. ఏం జరగనుందో చూడాలి.


