ల్యాండ్స్& సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి కేసులో ACB దర్యాప్తు కొనసాగుతోంది. ఏసీబీ అధికారులు కెనరా బ్యాంక్‌లో లాకర్‌ను తెరిచారు. నరహరి లాకర్‌లో ఉన్న రూ.కోటిన్నర నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల నరహరి ఇంట్లో రూ.1.54 కోట్ల నగదును గుర్తించి సీజ్ చేశారు. మరో రెండు లాకర్లు తెరిచేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు.
ఇటీవల నరహరి నివాసాలు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ సహా మొత్తం 10 ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో దాడులు చేపట్టారు. నరహరిపై ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
సోదాల్లో రూ.1.54 కోట్ల నగదు, 1.3 కిలోల బంగారం, 8 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. బ్యాంకు డిపాజిట్లు, లాకర్లు, భూములు, ఇతర ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. అధికారిక లెక్కల ప్రకారం కోట్ల రూపాయల ఆస్తులు గుర్తించగా, మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉండొచ్చని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. దర్యాప్తు అనంతరం నరహరిని ఏసీబీ అరెస్ట్ చేసింది.


