దేశ రాజధాని ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. బీజేపీ మిత్ర పక్షాలకు చెందిన పలువురు కీలక నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అందరూ వచ్చాక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వేదికపైకి చేరుకున్నారు. ఈ సమయంలో ఆసక్తికర ఘటన జరిగింది.
ప్రధాన మంత్రి వేదికపైకి వస్తూ అక్కడున్న వారందరికీ నమస్కరిస్తూ వచ్చారు. అయితే సనాతన ధర్మ వస్త్రధారణలో ఉన్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ని చూడగానే అక్కడే ఆగిపోయారు. పవన్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. పవన్‌తో ఏదో మాట్లాడారు మోదీ. దీనికి బదులిస్తూనే పవన్ కళ్యాణ్‌తో పాటు అక్కడున్న వారంతా నవ్వడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో మోదీ, పవన్ కళ్యాణ్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరలయ్యాయి.
అసలు పవన్‌తో మోదీ ఏం మాట్లాడారన్న విషయంపై అందరికీ ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో అక్కడి నుంచి వెళ్లిపోతున్న పవన్‌ను నేషనల్ మీడియా చుట్టుముట్టింది. మోదీ మీతో ఏం మాట్లాడారు అంటూ పలువురు మీడియా ప్రతినిధులు పవన్‌ను అడిగారు.
ఈ సందర్భంగా మోదీతో తన సంభాషణను పవన్ వివరించారు. “మోదీ గారు నన్ను చూడగానే నవ్వుతూ, ఏంటి అన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారా?”… అని అన్నారని పవన్ చెప్పారు. అయితే “అలాంటిది ఏమీ లేదు” అని పవన్ జవాబిచ్చారు. “దానికి ఇంకా చాలా సమయం ఉంది, ముందు ఇవన్నీ చూసుకోవాలి” అని మోదీ పవన్ తో చెప్పారట.