తెలంగాణ సచివాలయంలో ఫేక్ ఐడీలతో ప్రవేశించడం అంత సులభమా?.. ఎవరంటే వాళ్లు దర్జాగా అధికారులమంటూ చలామణి అవుతూ డబ్బులు దండుకోవడం అంత ఈజీనా?.. ఇటీవల ఘటనలు చూస్తుంటే నిజమేనని అనిపిస్తుంది. మొన్నటికి మొన్న ఓ వ్యక్తి సచివాలయంలో ఫేక్ ఐడీతో ఉద్యోగినంటూ హల్‌చల్ చేశాడు. తాజాగా మరో వ్యక్తి ఐఏఎస్ అధికారినంటూ ఏకంగా అపాయింట్ మెంట్ లెటర్స్ జారీ చేశాడు.
తాజాగా సచివాలయంలో ఫేక్ ఐఏఎస్ అధికారిగా చలామణి అవుతున్న వ్యక్తి భాగోతం బట్టబయలైంది. ఐఏఎస్ అధికారినని చెప్పుకుంటూ నిరుద్యోగులకు టోకరా వేస్తున్న వ్యక్తిని ఫేక్ ఐఏఎస్ అధికారి బాలకృష్ణ అలియాస్ బాలుగా గుర్తించారు. నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరి వ్యక్తుల నుంచి రూ.20,000 తీసుకొని ఉద్యోగాల అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చాడు. ఈ అపాయింట్ మెంట్ లెటర్స్ తీసుకుని ఆ ఇద్దరు వ్యక్తులు డైరెక్టుగా సెక్రటేరియట్‌కు వచ్చారు. అక్కడే తచ్చాడుతున్న ఇద్దరినీ ప్రశ్నించగా.. అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఫిర్యాదు చేసిన బాధితులు రాఘవేంద్ర, రాజ్ కుమార్ అని తెలుస్తోంది.
అయితే సొంత జిల్లా నాగర్ కర్నూల్‌లో ఫిర్యాదు చేయాల్సిందిగా సైఫాబాద్ పోలీసులు సూచించారు. ఈ మధ్య కాలంలో వరుసగా సెక్రటేరియట్లో ఫేక్ ఉద్యోగుల ఘటనలు బయటపడుతున్నాయి. రెవిన్యూ జూనియర్ అసిస్టెంట్‌గా ఫేక్ ఐడీ కార్డు తయారు చేయించుకున్న భాస్కరరావు వ్యవహారం ఇటీవలె బయటకు వచ్చింది. ఫేక్ తహసీల్దార్‌గా కొంపెల్లి అంజయ్య కారుపై కూడా తాసిల్దార్ స్టిక్కర్ తో ఎంట్రీ ఇచ్చాడు. వీరిని పక్కా ప్లాన్‌తో ఎస్పీఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు. ఇలా ఫేక్ ఉద్యోగుల వ్యవహారం చూస్తుంటే సచివాయంలో భద్రతపై అనుమానాలు వస్తున్నాయి.