స్వతంత్ర వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కాబోయే రాజధాని అని చెబుతున్న విశాఖ జిల్లా (Visakha District) లో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. వివిధ కారణాలతో ఖాళీ అయిన గ్రామ పంచాయతీ సర్పంచులు, వార్డు సభ్యుల పదవులకు ఈ నెల 19వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆరు సర్పంచ్, 73 వార్డు సభ్యుల ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. విశాఖపట్నం (Visakha) జిల్లాలో భీమిలి మండలం లక్ష్మీపురం, అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం బుచ్చెయ్యపేట, ఎస్.రాయవరం మండలం కొరుప్రోలు, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డివిజన్ పరిధిలోని జీకేవీధి మండలం సీలేరు, పెదబయలు మండలం పెదకోడాపల్లి, హుకుంపేట మండలం శోభకోట సర్పంచ్ పదవులకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.
వీటితో పాటు విశాఖ జిల్లాలో తొమ్మిది వార్డులు, అనకాపల్లి జిల్లాలో 26, అల్లూరి జిల్లా పాడేరు డివిజన్‌లో 38 వార్డు పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి పదో తేదీ వరకు ప్రతి రోజూ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 11వ తేదీన నామినేషన్ల పరిశీలన, 12న అభ్యంతరాలను స్వీకరించి, 13న అభ్యంతరాలను పరిష్కరిస్తారు.