ఫార్ములా ఈ-కారు రేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ఈడీ విచారణకు హాజరయ్యేందుకు అరవింద్ కుమార్, BLN రెడ్డి మరింత సమయం కోరారు. దీంతో, ఈ నెల 8, 9 తేదీల్లో విచారణకు రావాలని ఈడీ అధికారులు మళ్లీ నోటీసులు ఇచ్చారు.
మూడు వారాల సమయం కావాలని అరవింద్ కుమార్, BLN రెడ్డి ఈడీకి విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఈడీ.. రెండు వారాల సమయం కుదరదని చెప్పింది. ఈనెల 8వ తేదీన విచారణకు రావాలని BLN రెడ్డికి మరోసారి ఈడీ.. నోటీసులు జారీ చేసింది. అలాగే… ఈనెల 9న అరవింద్ కుమార్ హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. దీంతో, వీరిద్దరూ విచారణకు హాజరవుతారా… లేదా… అనేది ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ-కారు రేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్‌ను ఈనెల 7వ తేదీన ఈడీ అధికారులు విచారించనున్నారు. మరోవైపు.. ఈ కేసుకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ స్టేట్‌మెంట్‌ను కూడా ఈడీ అధికారులు తెప్పించుకున్నారు. ఈ స్టేట్‌మెంట్ ఆధారంగానే కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు.
ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్ కంటే ముందే ఏ2, ఏ3 అయిన అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిని విచారించాలని ఈడీ అధికారులు నిర్ణయించారు. కానీ, అనూహ్యంగా వారిద్దరూ తమకు సమయం కావాలని కోరారు. దీంతో.. ఈడీ అధికారులు ముందుగా కేటీఆర్‌నే విచారించాల్సి వస్తోంది.