ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఆర్డీఏ పరిధిలో రూ.2,733 కోట్ల మేర పనులు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. భవనాలు, లే అవుట్‌ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. తిరుపతిలోని ఈఎస్‌ఐ ఆస్పత్రిని 50 పడకల నుండి 100 పడకలకు పెంచుతూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
మొత్తం 14 అంశాలే ఎజెండాగా కేబినెట్‌లో చర్చ జరిగింది. మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ శాఖల అంశాలే ప్రధాన ఏజెండాగా మంత్రి వర్గ సమావేశం నిర్వహించారు. ఏపీ ఎం ఆర్ యూ డి ఏ చట్టం 2016లో భవనాల లే అవుట్‌ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ సవరణ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పిఠాపురం ఏరియా డెవలెప్మెంట్ అథారిటీలో 19 నూతన పోస్టులకు అనుమతి మంజూరు చేస్తూ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. గుంటూరుజిల్లా పత్తిపాడు మండలం నదింపాలెం గ్రామంలో ఆరున్నర ఎకరాల స్థలాన్ని 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
SIPB ఆమోదించిన రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడుల వలన 2,63,411 మందికి ఉద్యోగాలు వస్తాయని సమాచారం. నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో 6 వేల ఎకరాల్లో రూ. 96,862 కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటుకు కూడా మంత్రి మండలి ఆమోదించింది. విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్‌లో 2,08,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో టీసీఎస్ పెట్టుబడులకు కూడా ఆమోదం తెలిపింది. ఈ మేరకు వివరాలను మంత్రి పార్థసారథి తెలిపారు