ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా పరిధిలో ప్రజలకు సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ ను గురువారం రాత్రి మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి చొరవతో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (భెల్) సంస్థ సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా రూ. 2 కోట్ల నిధులతో ఈ వాహనాన్ని ఏర్పాటు చేసింది. ఈ వాహనం కృష్ణా జిల్లా పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో ప్రజలకు సేవలు అందించనుంది. మహిళల్లో క్యాన్సర్ లక్షణాలు గుర్తించేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్క్రీనింగ్ టెస్టులు చేసేందుకు వీలుగా ఏర్పాట్లు ఉన్నాయి. ఈ వాహనంలో ఏడు రకాల పరికరాలు అమర్చారు. వారంలో మూడు రోజులపాటు ఒక మండల పరిధిలోని గ్రామాల్లో సంచరిస్తూ అల్ట్రా సౌండ్, మొమోగ్రామ్, రక్త పరీక్షలు, ఎక్స్ రే, కెమికల్ అనాలసిస్, కొలనోస్కోపీ వంటి పరీక్షలు ఉచితంగా చేస్తారు. క్యాన్సర్ ను ముందుగానే గుర్తించేందుకు ఈ పరీక్షలు ఉపయోగపడతాయి.
ఈ సంచార క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ ద్వారా ఏడాదికి 40 వేల మరణాలు అరికట్టవచ్చని వైద్య నిపుణులు తెలిపారు. సామాజిక బాధ్యతతో ప్రజల కోసం ఈ వాహనాన్ని ఏర్పాటు చేసిన భెల్ కంపెనీ ప్రతినిధులను, చొరవ చూపిన ఎంపీ వల్లభనేని బాలశౌరిని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభినందించారు. క్యాన్సర్ నిర్ధారణ అయిన వారికి తక్షణం చికిత్స అందించేందుకు ఈ వాహనం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ , మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల శాసనసభ్యులు మండలి బుద్దప్రసాద్ , వర్ల కుమార రాజా, జిల్లా వైద్యాధికారులు, జిల్లా జనసేన నాయకులు పాల్గొన్నారు.