ఏపీ అసెంబ్లీలో అధికార, విపక్ష సభ్యులకు సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సీట్ల కేటాయింపునకు సంబంధించిన ప్రకటన విడుదల చేశారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. అలాగే వైసీపీ మాత్రం ఒంటరిగా పోటీ చేసింది. మూడు పార్టీల కూటమి ఏకంగా 164 సీట్లలో విజయం సాధించగా… వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితమై ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. అసెంబ్లీలో తాము మాత్రమే ప్రతిపక్షమని.. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఇప్పటికే వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదని అధికార కూటమి ఇప్పటికే తెగేసి చెప్పేసింది. ప్రధాన ప్రతిపక్ష హోదా రావాలంటే నిబంధనలను మండలిలో చదివి వినిపించారు మంత్రి నారా లోకేశ్.
తమకు ప్రతిపక్ష హోదా ఇచ్చేంత వరకు తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరవనంటూ జగన్ కూడా దూరంగా ఉంటున్నాడు. అసెంబ్లీ సెషన్స్ రాకుండా ఉండటానికి దీన్ని వంకగా చెబుతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఎవరు వచ్చినా.. రాకున్నా సభా సమావేశాలు అయితే నిర్వహించాల్సిందే కాబట్టి.. ఏపీ బడ్జెట్ సెషన్స్ వైసీపీ లేకుండానే జరిగిపోతున్నాయి. మరోవైపు సభకు ఎన్నికైన సభ్యులకు కూడా సీట్ల కేటాయింపు ప్రక్రియ కూడా జరిగిపోయింది. డిప్యూటీ స్పీకర్ ప్రకటించిన ప్రకారమే సీట్లలో కూర్చోవాల్సి ఉంటుంది.
డిప్యూటీ స్పీకర్ ప్రకటన మేరకు అధికార కూటమిలోని మంత్రి మండలిలో సభ్యులుగా ఉన్న వారిని ట్రెజరీ బెంచ్ గా పరిగణించారు. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సహా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర మంత్రులకు ముందు వరుసలోనే సీట్లను కేటాయించారు. చంద్రబాబుకు ఒకటో నెంబరు సీటు కేటాయించగా.. పవన్ కల్యాణ్ కు 39వ నెంబరు సీటును కేటాయించినట్టు రఘురామ ప్రకటించారు. ఇక మంత్రుల వెనుక సీట్లను చీఫ్ విప్, విప్ లకు కేటాయించారు. వైసీపీ పక్ష నేత హోదాలో జగన్ కు విపక్ష బెంచ్ లలో తొలి వరుసలోనే ముందు సీటును కేటాయించారు.