కూటమి ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు మాజీ మంత్రి రోజా. వైసీపీ కార్యకర్తలను తిరుపతి జిల్ల సత్యవేడు సబ్ జైజులో పరామర్శించిన నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా అనంతరం మీడియాతో మాట్లాడారు. పోసాని కృష్ణమురళి అరెస్టు అన్యాయమని అన్నారు. ఐదేళ్ల క్రితం మాట్లాడిన మాటలకు ఇప్పుడు మనోభావాలు దెబ్బతింటాయా? అంటూ ప్రశ్నించారు. పోసానిపై 111 కేసు పెట్టి అక్రమంగా ఇరికించారని అన్నారు. గతంలో ప్రధాని మోదీని చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ దారుణంగా మాట్లాడలేదా.. దేశద్రోహం కింద కేసులు పెట్టగలరా? అంటూ నిలదీశారు. తమకు కూడా అధికారం వస్తుంది?అప్పుడు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామంటూ హెచ్చరించారు.
కూటమి ప్రభుత్వంలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని.. ఎదురు తిరిగితే దాడులు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. చంద్రబాబుకు ఏదైనా జరిగితే పరుగున వచ్చి వాలిపోయే పవన్ కళ్యణ్.. రాష్ట్రంలో జరిగే అన్యాయాలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై కూడా రోజా మండిపడ్డారు.
చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రా.. టీడీపీకి ముఖ్యమంత్రా అని రోజా ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంపై పెట్టిన శ్రద్ధ మేనిఫెస్టోలో హామీలను అమలు చేయడంపై ఎందుకు పెట్టడం లేదని రోజా నిలదీశారు. అక్రమ కేసులతో పాలన చేద్దామనుకుంటే.. ఇదే రిపీట్ అవుద్ది అంటూ హెచ్చిరించారు. తిరిగి అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్ వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తారు అంటూ రోజా వార్నింగ్ ఇచ్చారు.