రాజధాని ప్రాంతంలోని భూముల నకిలీ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో మొవ్వ సబ్ రిజిస్టార్ సస్పెండ్ అయ్యారు. కృష్ణా జిల్లా మొవ్వ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రాజధాని ప్రాంత భూములకు సబ్ రిజిస్ట్రార్ నకిలీ రిజిస్ట్రేషన్ చేసినట్లు తేలింది. దీంతో సబ్ రిజిస్ట్రార్ సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి లోకేష్ ఆఫీసు బృందం ఆరా తీయడంతో ఈ నకిలీ రిజిస్ట్రేషన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
మంగళగిరిలోని రాజధాని ప్రాంతంలోని ఓ రైతుకు ప్రభుత్వం వెయ్యి గజాల స్థలం కేటాయించింది. ఆ రైతు మరణించడంతో ఆయన భార్య అనుభవదారుగా ఉన్నారు. ఆ భూమిపై కన్నేసిన అక్రమార్కులు నకిలీ ఆధార్ కార్డు సృష్టించి గత నెల 20న మొవ్వ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో నకిలీ రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ భూమి అమ్మేందుకు అక్రమార్కులు యత్నింస్తుండగా రైతు భార్య మంత్రి లోకేష్ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. లోకేష్ ఆఫీసు బృందం ఆరా తీపి, నకిలీ రిజిస్ట్రేషన్ జరిగినట్లు గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు.