తెలుగురాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. రోజు రోజుకి పడిపోతున్న ఉష్ఱోగ్రతలతో జనం వణికిపోతున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో కురుస్తున్న పొగ మంచుతో బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఇక దట్టంగా పొగ మంచు వ్యాపించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణలోని చాలా జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఉదయం 8 దాటినా సూర్యుడి దర్శనం కలగటం లేదు. మంచు దుప్పటి కప్పేస్తుండటంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆదిలాబాద్, అసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 11-15 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఈ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అయితే 9 డిగ్రీల సెల్సియస్‌కు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అర్లి(T)లో 8.7, ఆదిలాబాద్‌లో 9.7, మెదక్ 10, పటాన్‌చెరు 11, రామగుండం 13.8, హనుమకొండలో 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.
ఇక హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనూ చలి తీవ్రత పెరిగింది. చాలా ప్రాంతాల్లో 15 డిగ్రీలకు దిగువగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. రాజేంద్రనగర్ 13, హయత్‌నగర్ 13.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. భారీగా మంచు కురుస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 29 డిగ్రీలుగా.. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 16 డిగ్రీలుగా ఉండే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఉపరితల గాలులు తూర్పు, ఈశాన్య దిశలో గంటకు 04-08 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు ఏపీలోనూ చలి తీవ్రత పెరిగింది. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో చలి పంజాతో జనం వణికిపోతున్నారు. అరుకులో 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా,.. మినుములూరులో 12, పాడేరులో 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.