విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న కర్మాగారాన్ని పునరుజ్జీవింపజేయడానికి 11 వేల 440 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్యాకేజీకి గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన రోజు నుంచి విశాఖ ఉక్కుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిలతో సమావేశమై కర్మాగారం పునరుజ్జీవంపై చర్చలు జరుపుతూ ఉన్నారు సీఎం చంద్రబాబు. ఇటీవల ప్రధానిని మరోమారు కలిసి విశాఖ ఉక్కుకు అవసరమైన ఆర్థిక సాయం అందించాలని కోరారు. దీనిపై విభిన్న కోణాల్లో చర్చించిన అనంతరం కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ప్యాకేజీకి ఆమోదం తెలిపింది.
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్ర ప్యాకేజీపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రివైవల్ ప్యాకేజీ కింద కేంద్రం 11 వేల 440 కోట్లు కేటాయించిందని తెలిపారు. ప్యాకేజీ కేటాయించిన ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. నష్టాలను అధిగమించేందుకు, ప్లాంట్ పూర్తి ఉత్పాదనతో లాభాల బాట పట్టేందుకు కేంద్ర ప్యాకేజీ దోహద పడుతుందన్నారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజల ఆకాంక్షల పట్ల కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు అన్నారు.