ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ చెక్ తర్వాత ఫోన్, పాస్‌పోర్ట్‌లను తప్పనిసరిగా శానిటైజ్ చేయాలని ఓ అధ్యయనం ద్వారా తెలిసింది. విమాన ప్రయాణం అంటే చాలా హడావుడిగా ప్రారంభమవుతుంది. సమయానికి విమానాశ్రయానికి చేరుకుని, సెక్యూరిటీ చెక్ దాటుకుని .. బోర్డింగ్ వైపు పరుగెత్తడం చేస్తుంటారు. ఇదే సమయంలో చాలా మంది ప్రయాణికులు ముఖ్యమైన విషయాన్ని విస్మరిస్తుంటారు. అదే సెక్యూరిటీ తనిఖీల తర్వాత వెంటనే చేతులు, వ్యక్తిగత వస్తువులను శుభ్రం చేసుకోవడం.
2016 శీతాకాలంలో ఫిన్లాండ్‌లోని హెల్‌సిన్‌కీ- వంటా ఎయిర్‌పోర్టులో నిర్వహించిన ఒక అధ్యయనంలో, ప్రయాణికులు తరచుగా తాకే వివిధ ఉపరితలాలను పరీక్షించారు. ఆ పరీక్షల్లో సుమారు 10 శాతం ఉపరితలాలపై వైరస్‌ల ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా, భద్రతా తనిఖీల్లో ఉపయోగించే ప్లాస్టిక్ ట్రేలు అత్యంత కలుషితమైన వస్తువులలో ఒకటిగా తేలాయి. పరిశోధనల ప్రకారం.. విమానాశ్రయాల్లో ఉపయోగించే సెక్యూరిటీ ప్లాస్టిక్ ట్రేలు అత్యధికంగా సూక్ష్మక్రిములు ఉండే ప్రదేశాల్లో ఒకటిగా గుర్తించబడ్డాయి. కొన్ని సందర్భాల్లో టాయిలెట్స్ కంటే కూడా ఎక్కువగా కలుషితమై ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.


