అర్థరాత్రి ఆడవాళ్లు నిరభ్యంతరంగా వెళ్లినప్పుడే మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని ఆనాడు గాంధీజీ చెప్పారు. కానీ నేటి సంఘటనలు చూస్తుంటే మనకి నిజమైన స్వాతంత్రం రాలేదనే అనుకోవాలి.
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం తిరుమలగిరిలో ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది. 16ఏళ్ల బాలికపై సొంత బాబాయ్, అతని ముగ్గురు స్నేహితులు కలిసి అత్యాచారం చేయడమే కాదు, హత్య కూడా చేయడం అక్కడ సంచలనం సృష్టించింది. దీంతో గ్రామస్తులు దాడికి పాల్పడిన నిందితుల ఇళ్లపై దాడులు చేశారు. అక్కడే ఉన్న కారుకి నిప్పంటించారు.
బతుకు తెరువు కోసం తల్లిదండ్రులు హైదరాబాద్ వెళ్లడంతో బాలిక స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుకుంటూ ఒక్కరే ఇంటిలో ఉంటోంది. అదును చూసుకుని బాబాయ్ శ్రీనివాస్, అతని స్నేహితులు కలిసి తనపై లైంగికంగా దాడి చేశారు. తను ప్రతిఘటించడంతో హత్య చేసి పరారయ్యారు. ఈ మేరకు బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.