అసెంబ్లీలో గవర్నర్ తో కూడా చంద్రబాబు అబద్దాలు ఆడించారని ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా ఆరోపించారు. సూపర్ సిక్స్‌తో పాటు 143 హామీలను చంద్రబాబు ఇచ్చారన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఇరిగేషన్ గురించి గవర్నర్ ప్రసంగంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని అన్నారు. చంద్రబాబు ఈ ఐదేళ్లలో ఏం చేస్తారో చెప్పకుండా 2047 గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.
టీడీపీ జనసేన సిండికేట్ అయి లిక్కర్ మీద రేట్లు పెంచారని.. జలగల్లా పీల్చుతున్నారని రోజా ఆరోపించారు. విద్యుత్ ఛార్జీల రూపంలో రూ.15 వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేశారని ధ్వజమెత్తారు కానీ గవర్నర్ తో అసలు ఛార్జీలే పెంచలేదన్నట్టుగా మాట్లాడించారని అన్నారు.
తల్లికివందనం కింద రూ.15 వేలు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని రోజా దుయ్యబట్టారు. రైతులకు ఇస్తామన్న రూ.20 వేల గురించి మాట్లాడటం లేదని అన్నారు. చంద్రబాబు, కరువు కవల పిల్లలని విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఉన్న వాటినే తొలగించారని మండిపడ్డారు.
ఇంకా రోజా మాట్లాడుతూ.. ” ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ ఏమీ లేకుండా పోయాయి. ఎవరికైనా మేలు చేయాలంటే అది జగన్‌కే సాధ్యం. ప్రజా సమస్యలపై ప్రశ్నించటానికే ప్రతిపక్ష హోదా అడుగుతున్నాం. దీనిపై పవన్ కళ్యాణ్ వంకరగా మాట్లాడుతున్నారు. రష్యా అల్లుడుకి జర్మనీ గురించి బాగా తెలుసనుకుంటా.
పవన్‌కు ప్రతిపక్ష హోదా కావాలనుకుంటే డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలి. చంద్రబాబుకు ఎదురుగా కూర్చుని ప్రశ్నించాలి. జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి ఎందుకు భయం? . ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీలోనే తేల్చుకుంటాం. ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీ పదవిని కూడా ఇవ్వలేదు. అంటే వారు చేసే అవినీతిని బయటకు రానీయకుండా చేసే కుట్ర చేశారు.
టీవీ ఛానళ్లను కూడా అసెంబ్లీలోకి ఎందుకు రానివ్వటం లేదు?. కూటమికి భజన చేసే ఛానళ్లకే అనుమతులు ఇస్తారా? .. కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నందుకు గ్రూపు-2 అభ్యర్థులు రోడ్డు మీద చెప్పులతో కొట్టుకున్నారు. ప్రజలతో కలిసే పోరాటం చేసి కూటమి ప్రభుత్వాన్ని తరిమి కొడతాం. మిర్చి రైతులను జగన్ కలిసేదాకా ప్రభుత్వం స్పందించలేదు”.. అని రోజా అన్నారు.
ఇంకా రోజా మాట్లాడుతూ.. హుందాతనం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. గవర్నర్ మీద జగన్ కి గౌరవం ఉన్నందునే అసెంబ్లీకి వచ్చారని చెప్పారు. అసెంబ్లీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సొంత డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు. అసెంబ్లీలో కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయటం కూటమికే చెల్లిందని ఆరోపించారు. ప్రతిపక్ష హోదా అనేది ఒక బాధ్యత.. అది ఇవ్వనప్పుడు ఇక ప్రజల సమస్యలపై ప్రశ్నించేది ఎవరని.. రోజా నిలదీశారు.