జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో రేపటి నుండి మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి అలయంతోపాటు అనుబంధ ఆలయాలు సుందరంగా ముస్తాబు అయ్యాయి. ఆలయాలు, రాజగోపురాలు విద్యుత్ దీపాకాంతులతో విరాజిల్లుతున్నాయి. మూడు రోజుల పాటు జరిగే మహాశివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ మహేష్ తెలిపారు. సుమారు లక్ష మంది భక్తులు ఈ ఉత్సవాలకు వస్తారని అంచనావేస్తు వారికి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు, చలువ పందిళ్లు, శామియాలు, త్రాగునీటి వసతి, గోదావరి తీరంలో షేవర్లు, దుస్తులు మార్చుకొనుటకు గదులు, తాత్కలిక మరుగుదోడ్లు తదితర ఏర్పాట్లు ఆయా శాఖల అధికారులు చేపట్టినట్లు ఈఓ పేర్కోన్నారు.
రేపు ఉదయం 10 గంటలకు గణపతి పూజతో ఉత్సవం ప్రారంభం అవుతుందని, సాయంత్రం అగ్ని ప్రతిష్ఠ, రుద్రహవనం, ఊరేగింపు, ఎదుర్కోలు సేవ, 26న సాయంకాలం శ్రవణా నక్షత్రయుక్తా కర్కాటక లగ్నమందు 4.35 గంటలకు శ్రీ శుభానంద ముక్తీశ్వర కల్యాణం మహోత్సవం అంగరంగ వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఉపాప్రధాన అర్చకులు ఫణీంద్ర శర్మ తెలిపారు. అదే రోజు రాత్రి 12 గంటలకు లింగోద్భవ పూజ, 27న ఉదయం 8 గం.శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం,పూర్ణహుతి, సాయంత్రం 4 గం. ఆదిముక్తీశ్వరాలయంలో స్వామి వారి కల్యాణం నిర్వహించనున్నట్లు తెలిపారు.
రేపు, ఎల్లుండి రాత్రి వేళాళ్లో ప్రసిద్ధ కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమంతో పాటు హరికథ కాలక్షేపం, కూచిపూడి ,భరతనాట్యం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామి వారిని దర్శించుకొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని, పూజలు నిర్వహించుకోవాలని అర్చకుడు తెలిపారు. ఈ ఉత్సవాలలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.