అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి BRSని కుంగదీసింది. KCRకి అనారోగ్యం, కవిత జైలుకి వెళ్లడంతో ఆ పార్టీ మునుపెన్నడూ చూడని కష్టకాలాన్ని ఎదుర్కొంది. ఫార్ములా E-CAR రేసు కేసులో KTR ఇరుక్కోవటం BRS కేడర్‌లే నైరాశ్యం నింపింది. పదేళ్లు అప్రతిహతంగా తెలంగాణ రాజకీయాలను శాసించిన BRS పార్టీకి 2024 కలిసిరాలేదా…? పార్టీ ఏర్పాటు తర్వాత అత్యంత గడ్డు పరిస్థితులను చవిచూసిందా…? ఏడాది కాంగ్రెస్ పాలనను ఎదుర్కోవడంలో గులాబీ నేతలు సక్సెస్ అయ్యారా…? BRSకి 2024 ఎలా గడించింది…? కారు పార్టీ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉండనున్నాయి…?
ఏడాది ప్రారంభానికి మునుపే గులాబీ పార్టీకి అతిపెద్ద షాక్ తగిలింది. గతేడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పరాజయం పాలైంది. 23 ఏళ్ల చరిత్రలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించడం BRSకి ఇదే మొదటిసారి. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టిన నాటి నుంచి ఉద్యమ పార్టీగానే TRS పనిచేసింది. 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో TRS విజయం సాధించి అధికారం చేపట్టింది. కేసీఆర్ నాయకత్వంలో వరుసగా పదేళ్లు తెలంగాణను BRS పాలించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని పోరాటాలు ప్రారంభించారు గులాబీ నేతలు. BRS పార్టీ నుంచి గెలిచిన 39 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు. లాస్య మృతితో వచ్చిన బైపోల్‌లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అటు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా BRSకి దక్కలేదు.
ఆరు గ్యారంటీలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. హామీల అమలులో హస్తం విఫలమైందనేది BRS ఆరోపణ. ఏడాది కాలంగా ఎన్నికల హామీలపై కాంగ్రెస్ పార్టీని BRS ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఏక్ పోలీస్ విధానం, గురుకుల పాఠశాలల్లో సమస్యలు మహిళలకు ఇచ్చిన హామీలు సహా వివిధ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు BRS ప్రయత్నం చేసింది. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తున్నారని నల్లగొండలో కేసీఆర్ బహిరంగ సభను నిర్వహించారు. పంట పొలాలు ఎండిపోతున్నాయని పొలం బాట కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల ముందు కరీంనగర్‌లో బహిరంగ సభను నిర్వహించారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో ఒక రోజు కేసీఆర్ అలా కనిపించి మళ్లీ కనుమరుగైపోయారు. పూర్తిగా ఫాం హౌజ్‌కే పరిమితం అయ్యారు.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ కేడర్‌లో పూర్తి నైరాశ్యం నింపాయి. కొన్ని రోజుల పాటు ప్రజల్లోకి BRS వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. హైడ్రా, మూసీ ప్రక్షాళన నిర్ణయాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు BRSకి కాంగ్రెస్ పార్టీయే దారిచూపింది. హైడ్రాతో అక్రమ నిర్మాణాలు కూల్చివేసే క్రమంలో పేదల ఇళ్లను సైతం హైడ్రా కూల్చింది. పేదల నుంచి రేవంత్ సర్కార్‌కి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. హైడ్రాను అస్త్రంగా చేసుకుని… పేద ప్రజలను తమవైపు తిప్పుకోవటంలో BJP కంటే BRS సక్సెస్ అయింది. ఇదే సమయంలో మూసీ పునరుద్ధరణ పేరుతో నది పరివాహక ప్రాంతంలో ప్రభుత్వం పేదల ఇళ్లకు మార్కింగ్ వేసింది. దీంతో ప్రభుత్వం అధికారులకు స్థానిక ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ అంశాన్ని సైతం అందిపుచ్చుకోవడంలో ప్రధాన ప్రతిపక్షం BRS వ్యూహం పనిచేసింది. KTR, హరీశ్ రావులు సిటీ BRS MLAలతో కలిసి మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు ధైర్యం కల్పించారు.
GHMC లిమిట్స్‌లో హైడ్రా, మూసీ ప్రక్షాళనతో కాంగ్రెస్‌ని ఎండగట్టిన BRS… రూరల్‌లో రైతు బంధు, రుణమాఫీ విషయంలో హస్తాన్ని ఇరుకున పెట్టింది. హరీశ్ రావు సవాల్‌ను స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి… ఆగస్టు 15లోపు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసి తీరుతామని ప్రతిసవాల్ విసిరారు. అయితే పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేకపోయింది ప్రభుత్వం. దీంతో రైతుల నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైంది. దాన్ని క్యాష్ చేసుకునేందుకు రైతులతో కలిసి వివిధ జిల్లాల్లో BRS ధర్నాలు నిర్వహించింది. తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావటంలో ప్రధాన ప్రతిపక్షం సఫలమైంది. దీంతో రుణమాఫీ కాని రైతులకు కూడా త్వరలో రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటన చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
తెలంగాణలో అధికారంలో కోల్పోయిన తర్వాత మాజీ సీఎం KCR ఫాంహౌస్‌కే పరిమితం అయ్యారు. KCR తర్వాత గులాబీ పార్టీలో కీలక నేతలుగా ఉన్న KTR, హరీశ్ రావులే అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. అయితే ప్రజలిచ్చిన ప్రతిపక్ష నేత పాత్రను కేసీఆర్ పోషించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కీలక సమయాల్లోనూ… ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ స్పందించడం లేదన్న విమర్శలూ ఉన్నాయి. వరదలతో ఖమ్మం, వరంగల్ జిల్లాల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి కీలక సమయాల్లో సాధారణంగా ప్రతిపక్ష నేతలు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు భరోసా కల్పిస్తుంటారు. అయితే ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన ఒక రోజు మినహా KCR బయట కనిపించలేదు. అసెంబ్లీ సమావేశాలకు సైతం హాజరుకాలేదు. మొన్నటి శీతాకాల సమావేశాలకు సైతం దూరంగానే ఉన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని గతంలో కేసీఆర్ ఓ సారి చెప్పాడు. అందుకే మౌనం వహించారని… కొత్త ఏడాదిలో కేసీఆర్ బయటకి వస్తారని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. KTR, హరీశ్‌రావులు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. మరోవైపు జైలు నుంచి విడుదలైన తర్వాత కొన్ని రోజులు స్తబ్దుగా ఉన్న కవిత సైతం రీ ఎంట్రీ ఇచ్చారు. కులగణన అంశంపై బీసీ సంఘాలను ఏకం చేసే పనిలో పడ్డారామె. తెలంగాణ జాగృతి సంస్థను మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇంకోవైపు 2024 బీఆర్ఎస్ పార్టీకి అత్యంత గడ్డుకాలాన్ని మిగల్చిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలుమార్లు కామెంట్ చేశారు. ఏడాది చివర్లో కేటీఆర్‌పై ఫార్ములా E-CAR రేస్ కేసులో హైకోర్టులో రిలీఫ్ దొరికినా…. ఈడీ కేసునమోదు చేయడం BRS పార్టీలో అలజడి మొదలైంది. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టిన BRS… కాంగ్రెస్ వైఫల్యాలపై ఫైట్ చేస్తోంది. దీంతో వచ్చే ఏడాది గులాబీ పార్టీకి ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి.