కాకినాడ జిల్లాలో మిస్ అయిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్టరీ వీడడం లేదు. పన్నెండు రోజులు గడిచినా చిన్నారి ఆచూకీ లభించలేదు. పోలీసులు,ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రెస్క్యూ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నా చిన్న క్లూ కూడా లభించలేదు.
చిన్నారి అదృశ్యమైన ప్రాంతంలో అడవి జంతువులు, కొండ చిలువలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు.చిన్నారి మిస్ అయిన ప్రాంతం కొండ ప్రాంతం. పామాయిల్ తోట సరిహద్దు వద్ద ఇనుప కంచెకు బాలిక ఆనవాళ్ళతో రెండు బొమ్మలను ఏర్పాటు చేశారు. ఆ బొమ్మలకు మాంసం లోపల ఉంచి అడవి జంతువులు ఏమైనా వస్తాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతమంతా ధర్మల్ డ్రోన్లు, రాత్రి వేళల్లో స్పష్టంగా కనిపించే విధంగా కెమెరాలు ఏర్పాటు చేశారు.
మరోవైపు చిన్నారి అదృశ్యంపై హోం మంత్రి అనిత ఎస్పీ బిందు మాధవ్ తో మాట్లాడారు. చిన్నారి అటవీ ప్రాంతంలో ఏదైనా ప్రమాదానికి గురైందా అనే కోణంలో పరిశీలిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆరు కిలోమీటర్ల పరిధిలో ఇప్పటివరకు చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు పది కిలోమీటర్ల వరకు గాలించాయని చెబుతున్నారు. అలాగే 170 ఫోన్ కాల్స్‌ను విశ్లేషించి ఆయా వ్యక్తులను నాలుగు బృందాలుగా విచారిస్తున్నామని చెప్తున్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి ఇనుప కంచె దాటిన తర్వాత ఎవరైనా ఎత్తుకెళ్లారా అనే కోణంలోనూ పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా 15 రోజుల క్రితం సంచార జాతులకు చెందిన కొందరు ఈ ప్రాంతానికి వచ్చి నాలుగు రోజులు ఉండి వెళ్లారని వీరి కోసం కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.


