ఫ్రాన్స్‌లోని ఎవియన్-లే-బెయిన్స్‌లో మంగళవారం జరిగిన జీ7 (G7) సదస్సులో ప్రపంచ నాయకులు కీలక అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. ఉక్రెయిన్‌కు తమ మద్దతును మరోసారి పునరుద్ఘాటించడంతో పాటు, అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కీలక ఒప్పందాన్ని స్వాగతించారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మధ్య జరిగిన చిన్న సంభాషణ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో గతంలో ట్రెండ్ అయిన మెలోడి హ్యాష్‌ట్యాగ్ మరోసారి చర్చనీయాంశమైంది.
వైరల్‌గా మారిన వీడియోలో, ఇతర ప్రపంచ నాయకులతో కలిసి గ్రూప్ ఫోటో కోసం నిలబడే ముందు మోదీ, మెలోని ఒకరినొకరు పలకరించుకుని షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అక్కడే ఉన్నారు.
వీడియోలో ఆడియో స్పష్టంగా వినిపించకపోయినా, తమ సోషల్ మీడియా ప్రజాదరణ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించినట్లు కనిపించింది. దీనికి స్పందించిన మెలోని నవ్వుతూ, ..అవును, ఇన్‌స్టాగ్రామ్‌లో మేమే పాపులర్ కపుల్.. అని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యతో అక్కడ ఉన్నవారిలో చిరునవ్వులు చిందగా, సోషల్ మీడియాలో కూడా ఈ వీడియోకు భారీ స్పందన లభిస్తోంది.


