- కొత్త తరం కోసం జాతీయ విద్యా విధానం
- విద్యావ్యవస్థను తీర్చిదిద్దుతున్నామన్న మోదీ
- ఆంధ్రప్రదేశ్‌లో కొత్త విధానం ఇప్పటికే అమలు
భారత దేశ భవిష్యత్ కోసమే జాతీయ విద్యా విధానం తీసుకొని వచ్చినట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెల్లడించారు. ఈ జాతీయ విధానంతో దేశంలో దూరదృష్టిగల, భావి కాల లక్షణాలున్న విద్యావ్యవస్థను తీర్చిదిద్దుతున్నట్లు ఆయన వివరించారు. రాజ్‌కోట్‌లోని శ్రీ స్వామి నారాయణ్ గురుకుల్ సంస్థాన్ 75వ అమృత మహోత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన వర్చువల్ విధానంలో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న మార్పులను విశదీకరించారు. జాతీయ విద్యా విధానం ద్వారా కలగబోయే ప్రయోజనాలను వివరించారు.

జాతీయ విద్యా విధానంలో భావి కాల లక్షణాలున్న, దూరదృష్టిగల విద్యా వ్యవస్థను రూపొందిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (IITs), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIMs), వైద్య కళాశాలల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగినట్లు తెలిపారు. IIT, IIIT, IIM, AIIMS వంటి భారీ విద్యా సంస్థల సంఖ్య పెరుగుతోందన్నారు. దేశంలో వైద్య కళాశాలల సంఖ్య 65 శాతం కన్నా ఎక్కువగా పెరిగిందన్నారు. మొత్తం మీద జాతీయ విద్యా విధానంతో భారతదేశ రూపురేఖలు మారిపోతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

దేశంలో జాతీయ విద్యా విధానం అమలు చేయాలని కేంద్రం ప్రతిపాదించగా.. మొదటగా స్పందించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఏపీలోని ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలల్లో కొత్త విధానాన్నిపరికల్పన చేశారు. ఇప్పటి వరకు ఉన్న 10+2+3 కు బదులు 5+3+3+4 విధానంలోకి తీసుకొని వస్తున్నారు. అంగన్వాడీని పాఠశాలల్లో కలిపేసి సమగ్ర విధానాన్ని తీసుకొని వస్తున్నారు. ప్రతిదశలోనూ ప్రాక్టికల్ ఓరియంటెడ్ విద్యను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు. ఈ జాతీయ విద్యా విధానం గొప్పతనాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా వెల్లడించటం విశేషం.