కేంద్రం ప్రతిపాదించిన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశానికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీల ‘ఉమ్మడి కార్యాచరణ కమిటీ’లో చేరాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుక్రవారం బెంగాల్‌కు చెందిన మమతా బెనర్జీ, పంజాబ్‌కు చెందిన భగవంత్ మాన్, బిజెపి పాలిత ఒడిశాకు చెందిన మోహన్ చంద్ర మాఝి సహా ఏడుగురు ముఖ్యమంత్రులకు పిలుపునిచ్చారు.
సమిష్టి కార్యాచరణ కోసం మార్చి 22న చెన్నైలో జరిగే సమావేశానికి హాజరుకావాలని కోరారు. కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే ఈ రాష్ట్రాలలోని అధికార పార్టీలు, బిజెపికి చెందిన సీనియర్, రాజకీయ నాయకులను కోరారు.
“డీలిమిటేషన్ అనేది సమాఖ్యవాదంపై చేస్తోన్న దాడి, ఇది పార్లమెంటులో మన హక్కులకు కోత పెట్టి.. తద్వారా జనాభా నియంత్రణను నిర్ధారించిన రాష్ట్రాలను శిక్షించడమే అవుతుంది. ఈ అన్యాయాన్ని మేం సహించబోం” అని స్టాలిన్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, స్టాలిన్ , ఆయన ప్రభుత్వం కేంద్రం యొక్క ‘హిందీ ‘ ,సరిహద్దుల పునర్విభజనను తీవ్రంగా నిరసిస్తున్నారు. రెండూ అవసరం లేదని ,మొత్తంగా రాజ్యాంగం యొక్క సమాఖ్య స్వభావంపై, తమిళ ప్రజలు, తమిళ భాషపై దాడికి సమానమని వాదిస్తున్నారు.
డీలిమిటేషన్ వివాదం ఏమిటీ..?
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన 2026లో జరగనుంది. . జనాభా తక్కువగా ఉండటంతో లోక్‌సభలో వాటి ప్రాతినిధ్యానికి కోత పడుతుందన్న భయాలను తమిళనాడు ప్రభుత్వం లేవనెత్తుతోంది. కుటుంబ నియంత్రణ పాటించడంలో దక్షిణాది రాష్ట్రాలు సాధించిన విజయమే వాటి పాలిట శాపం కానుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనాభా కట్టడి చేయలేకపోయిన ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌లు లోక్‌సభలో తమ సీట్ల సంఖ్యను ఇప్పటికన్నా పెంచుకోనున్నాయి.
ఫలితంగా కేంద్రం నుంచి తమకు రావాల్సిన నిధుల కోసం డిమాండ్ చేసే సత్తా దక్షిణాది రాష్ట్రాలకు తగ్గిపోతుందనే ప్రచారం జరుగుతోంది. తాము నిర్లక్ష్యానికి గురవుతున్నామనే భావన దక్షిణ భారత రాష్ట్రాల్లో వ్యాపిస్తోంది. అందుకే జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనను తమిళనాడు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఈ అంశంలో కేంద్రంతో పోరాడుతోంది. పార్లమెంటు సభ్యుల సంఖ్యను పెంచే పక్షంలో 1971 జనాభా లెక్కల ఆధారంగా ఇరు సభల్లో రాష్ట్రాల మధ్య ప్రస్తుతమున్న నిష్పత్తి మేరకు నియోజకవర్గాల సంఖ్యను పెంచడానికి అవసరమైన రాజ్యాంగ సవరణలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.