సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మరోసారి వార్తలకెక్కారు. మరోసారి ఆయన తీరు చర్చనీయాంశమైంది. సొంత పార్టీపైనే బూతుపురాణం అందుకున్నారు. కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గుమ్మడిదల మండలం ప్యారా నగర్ డంప్ యార్డ్ ఏర్పాటు కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ అఖిలపక్షం జేఏసీ నాయకులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కలిశారు. డంప్ యార్డు బాధితులు ఎమ్మెల్యేకు విన్నపాలు చేసుకున్నారు. ప్రభుత్వానికి తమ గోడు చెప్పాలని కోరారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే ప్యారానగర్ డంపు యార్డ్ వాసులపై ఫైర్ అయ్యారు. నిరసన చేయబట్టి 30 రోజుల తర్వాత ఈరోజు నేను గుర్తుకు వచ్చానా.. అంటూ గ్రామస్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు నిరసనలు చేయబట్టి ఇన్ని రోజులైతే ఇప్పుడు నా దగ్గరికి వస్తారా… అని అన్నారు. అయితే మీరు అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి మాకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర దుర్భాషలాడారు. అదొక పార్టీ అంటూ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను బీఆర్‌ఎస్ పార్టీ నేతనంటూ చెప్పుకొచ్చారు.
తమను క్షమించాలంటూ డంప్ యార్డ్ వాసులు వేడుకున్నారు. అయినా ఎమ్మెల్యే గ్రామస్తుల విన్నపాలను పట్టించుకోకుండా .. ఇంత లేటుగా వస్తే తాను ఏమీ చేయలేనని చెప్పారు. పెద్ద పెద్ద నాయకులు, వందల కోట్లు, రెండు వందల కోట్లు ఉన్న నాయకులు ఎక్కడ .? రాష్ట్ర నాయకులు ఎక్కడా.. గల్లాలు ఎగుర వేసుకుని తిరిగే నాయకుడు ఎక్కడా.. మీకే రాజకీయం చేయడానికి వస్తదా.. నాకు రాదా.. అంటూ అని గుమ్మడిదల జిన్నారం ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం గూడెం మహిపాల్ రెడ్డి గ్రామస్తులతో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదంతా చూస్తుంటే ఆయన తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లే సంకేతాలు కనిపిస్తున్నాయని పటాన్‌చెరు ప్రజల్లో చర్చ జరుగుతోంది.