2014-2019 మధ్య ఏపీ అభివృద్ధి పథంలో నడిచిందని.. వైసీపీ హయాంలో రాష్ట్రం వెనుకబడిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కష్టపడితేనే అభివృద్ది సాధ్యమవుతుందని అన్నారాయన. హైదరాబాద్‌లో తాను చేసిన అభివృద్ధితో నేడు ఫలాలు వస్తున్నాయని చెప్పారు. చిత్తూరు జిల్లా ద్రవిడ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం- విజన్ 2029 డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు.
ప్రతి ఇంటికీ పారిశ్రామికవేత్త ఉండాలనేది నా విజన్. కుప్పం అభివృద్ధికి ప్రణాళికలు రచించాం. కుప్పానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. జీవితంలో ఒకేసారి అవకాశం వస్తుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే వైకుంఠపాళి పరిస్థితి ఎదురవుతుంది. ఇది అన్ని రంగాలకూ వర్తిస్తుంది.
విజన్ డాక్యుమెంట్ విషయంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. అందరూ భాగస్వాములు కావాలి. ఉద్యోగాలు చేయడమే కాదు ఇవ్వాలన్న ఆలోచన కూడా ఉండాలి. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు తీర్చగలిగే ఎమ్మెల్యేలు ఎప్పుడూ పదవుల్లో ఉంటారు. తెలుగు దేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత నుంచి కుప్పంలో టీడీపీయే గెలుస్తుంది. పోటీ చేసిన ప్రతీసారీ గెలిపించారు. కుప్పం ప్రజలకు నా ధన్యవాదాలు.. అని చంద్రబాబు అన్నారు.