స్వతంత్ర వెబ్ డెస్క్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలను ఎదుర్కొంటోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్‌పై తీవ్ర ఉత్కంఠత నెలకొంది.సుప్రీం కోర్టు ఆదేశాలతో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ లక్ష్మణ్ విచారించారు. అవినాష్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది ఉమామహేశ్వరరావు, సునీత తరఫున సీనియర్ కౌన్సిల్ రవిచంద్ర, సీబీఐ తరఫున అనిల్ తల్వార్ తమ వాదనలు వినిపించారు. మూడు రోజులు పాటు వాదనలు విన్న హైకోర్టు బుధవారం ఉదయం అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై నేడు తీర్పు ఇవ్వనుంది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అవినాష్ రెడ్డి ఇప్పటికే ఏడుసార్లు సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ నెల 22వ తేదీన మరోసారి విచారణకు హాజరు కావాలని సిబిఐ నోటీసులు జారీ చేయగా.. తల్లి అనారోగ్యానికి గురి కావడంతో తనకి గడువు కావాలని అవినాష్ కోరారు. గతంలో విచారణకు హాజరైనప్పుడే తాను అన్ని విషయాలను సీబీఐ అధికారులకు తెలియజేశానని అవినాష్ రెడ్డి పదే పదే చెబుతూ వస్తోన్న విషయం తెలిసిందే. వివేకా హత్యకేసులో తన వద్ద ఉన్న సమాచారం మొత్తాన్నీ వారికి వివరించానని, ఇందులో దాచిపెట్టాల్సిన అంశాలేవీ లేవంటూ ముందునుంచీ చెబుతూ వస్తోన్నారాయన. అనారోగ్యానికి గురైన తల్లిని బాగోగులను చూసుకుంటోన్న పరిస్థితుల్లో విచారణకు హాజరు కాలేననీ సీబీఐ అధికారులకు వివరించారు. విచారణలో భాగంగా సీబీఐ అధికారులు కర్నూలు కూడా చేరుకున్న నేపథ్యంలో అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ముందస్తు బెయిల్ పిటీషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆమె కోలుకునేంత వరకు తనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ సీబీఐ అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. విచారణ సందర్భంగా జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. 25వ తేదీ నాటికి విచారణను ముగించాలనీ సూచించింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఆదేశాలతో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు- పలు కీలక వ్యాఖ్యలు చేసింది. సీబీఐకి పలు ప్రశ్నలను సంధించింది. తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. నేటి తీర్పు ఎలా ఉంటుందనేది ఉత్కంఠతను రేకెత్తిస్తోంది.
తుది తీర్పు వెళ్లడయ్యే ముందు పలువురు సాక్ష్యుల స్టేట్‌మెంట్స్ పరిశీలించాక నిర్ణయం తీసుకోవాలని గత వాదనలో సిబీఐ పేర్కొన్నది. పలువురు సాక్ష్యులకు సంబంధించిన స్టేట్‌మెంట్స్ షిల్డ్ కవర్లో ఇస్తామని ఇప్పటికే సిబీఐ హైకోర్టుకు తెలిపింది. మరోవైపు తన తల్లిని హైదరాబాద్ ఏ ఐ జి హాస్పిటల్ కు తరలించినప్పటి నుండి హైదరాబాద్ లోనే ఉంటున్నారు ఆవినాష్ రెడ్డి. ఇక కోర్టు తీర్పు నేపథ్యంలో సిబీఐ తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది.