25.7 C
Hyderabad
Sunday, March 16, 2025
spot_img

రేవంత్ పాలనపై రాహుల్ గాంధీ పర్యవేక్షణ?

రేవంత్ రెడ్డి పాలనపై రాహుల్ గాంధీ నిఘా పెట్టారా? ఇకపై రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు కావొస్తుంది. పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన ఏడాదికే ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకుంటుందనే ఆరోపణలు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పలు విషయాల్లో దూకుడుగా వెళ్తూ.. ప్రజల వ్యతిరేకతను పెంచుతున్నారంటూ విమర్శలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా ఇటీవల కాలంలో10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమై ప్రభుత్వ పని తీరుపై, రేవంత్ పాలనపై చర్చించుకోవడం హైకమాండ్ సీరియస్‌గా తీసుకుంది. అంతే కాకుండా మంత్రులు కమీషన్ల వ్యవహారం కూడా అధిష్టానం దృష్టికి వెళ్లిందట. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ పాలనను పర్యవేక్షించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలిసింది.

తెలంగాణ పట్ల మొదటి నుంచి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న రాహుల్ గాంధీ.. ఇకపై పాలనను నేరుగా పర్యవేక్షించాలని భావిస్తున్నారట. అందుకే ఇప్పటి వరకు తెలంగాణకు ఇంచార్జిగా పని చేసిన దీపాదాస్ మున్షిని రాష్ట్ర బాధ్యతల నుంచి తప్పించినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు మున్షి కేరళలతో పాటు తెలంగాణ వ్యవహారాలను పర్యవేక్షించారు. అయితే ఇప్పుడు మున్షిని కేవలం కేరళకు మాత్రమే పరిమితం చేసి.. తెలంగాణకు మీనాక్షి నటరాజన్‌ను ఇంచార్జిగా నియమించారు. వాస్తవానికి తెలంగాణ ఎన్నికల సమయంలో మాణిక్ రావు ఠాక్రే ఇంచార్జిగా ఉన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దీపాదాస్ మున్షిని తాత్కాలిక ఇంచార్జిగా నియమించారు. అయితే ఆమె వ్యవహార శైలి తీవ్ర వివాదాస్పదంగా మారింది. కేవలం తాత్కాలిక నియామకమే అయినా.. ఏకంగా హైదరాబాద్‌లోనే ఒక ఇంటిని అద్దెకు తీసుకొని సమాంతర ప్రభుత్వం నడిపించారన్న అరోపణలు ఉన్నాయి.

ఇంచార్జిగా రాష్ట్ర వ్యవహారాలను పర్యవేక్షించాల్సిన దీపా దాస్ మున్షి.. ఏకంగా పాలనలోనే వేలు పెట్టారనే టాక్ ఉంది. ప్రభుత్వ సమావేశాలు, కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ప్రతిపక్షాల విమర్శలకు కారణం అయ్యారు. అంతే కాకుండా పలు విషయాల్లో ఆమె అడ్డంకిగా మారారని స్వయంగా కాంగ్రెస్ నేతలే హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారట. రోజు రోజుకూ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోతుండటంతో హైకమాండ్ మేలుకుందని సమాచారం. అందుకే హార్డ్ కోర్ కాంగ్రెస్ కార్యకర్త, మాజీ ఎంపీ మీనాక్షీ నటరాజన్‌ను ఇంచార్జిగా నియమించారట. మీనాక్షి నియామకం వెనుక రాహుల్ గాంధీ ఉన్నట్లు టాక్ నడుస్తుంది. తెలంగాణపై మొదటి నుంచి శ్రద్ద చూపిస్తున్న రాహుల్ గాంధీ.. ఇకపై రాష్ట్రంలో జరిగే ప్రతీ పరిణామాన్ని స్వయంగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ మాజీ ఎంపీగా పనిచేసిన మీనాక్షీ నటరాజన్.. ఇప్పుడు రాహుల్ గాంధీ కోర్ టీమ్‌లో సభ్యురాలిగా ఉన్నారు. రాహుల్‌కు ఆమె అత్యంత సన్నిహితురాలిగా కాంగ్రెస్ నాయకులు చెప్తారు. అందుకే ఏరి కోరి రాహుల్ ఆమెను తెలంగాణకు పర్యవేక్షకురాలిగా పంపినట్లు తెలిసింది. వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి అంటే మొదటి నుంచి రాహుల్‌కు సాన్నిహిత్యం ఎక్కువే. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొని రావడానికి రేవంత్ చేసిన కృషిని రాహుల్ ఎప్పుడూ మెచ్చుకుంటూనే ఉంటారు. అయితే ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వంపై వస్తున్న విమర్శలు.. ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు హైకమాండ్ దృష్టికి వెళ్లాయట. వీటిపై రాహుల్ టీమ్ కూడా అధ్యయనం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇకపై రాష్ట్రంలో పరిస్థితులను పరిశీలించాలని రాహుల్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

వాస్తవానికి కాంగ్రెస్ ఇంచార్జులంటే పార్టీ కోసం మాత్రమే పని చేస్తారు. పార్టీలోని అసంతృప్తులను బుజ్జగించడం, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి అవసరమైన సూచనలు చేయడం, ఎన్నికల సమయంలో సరైన అభ్యర్థులు ఎవరనే విషయంలో అధిష్టానానికి సూచనలు ఇవ్వడంతో పాటు.. పాలన ఎలా జరుగుతుంది? ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అనే విషయాలను ఎప్పటికప్పుడు హైకమాండ్‌కు తెలియచేయాలి. కానీ ఇంతకు ముందు ఇంచార్జిగా పని చేసిన దీపాదాస్ మున్షి ఏకంగా సమాంతర ప్రభుత్వం నడిపారనే విమర్శలు ఉన్నాయి. అందుకే ఆమెను తప్పించి.. మీనాక్షీ నటరాజన్‌కు బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. అంతే కాకుండా త్వరలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించాల్సి ఉంది. దీనిపై కూడా హైకమాండ్ దృష్టిపెట్టినట్లు తెలిసింది.

పార్టీ కోసం నిబద్దతతో పని చేసే నాయకురాలిగా మీనాక్షీ నటరాజన్‌కు పేరుంది. ఆమె పెద్దగా వివాదాల జోలికి కూడా పోరు. పైగా రాహుల్ కోర్ టీమ్ సభ్యురాలు కావడంతో.. ఇకపై తెలంగాణ రాష్ట్ర పాలనలో పెను మార్పులే చోటు చేసుకుంటాయనే టాక్ నడుస్తోంది. మరి కొత్త ఇంచార్జి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉండబోతుందో వేచి చూడాలి.

Latest Articles

‘కాలమేగా కరిగింది’ ట్రైలర్ చూశారా?

వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది". ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్