ప్రధాని నరేంద్రమోదీ కులం విషయంలో… సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరి వెంట మరొకరు అన్నట్లుగా కమలం నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇదే సమయంలో రాహుల్ కులంపై.. కాషాయ పార్టీ నేతలు చేసిన కామెంట్లకు కౌంటరిస్తున్నారు హస్తం నాయకులు.
సీఎం బాధ్యతారాహిత్యం- కిషన్ రెడ్డి
సీఎం స్థాయిలో ఉండి రేవంత్ రెడ్డి… ప్రధాని మోదీ కులం విషయంలో అలా మాట్లాడడం సరికాదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 1994లోనే నరేంద్రమోదీ కులాన్ని బీసీల్లో చేర్చారని గుర్తు చేశారు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి బాధ్యతా రాహిత్యంగా మాట్లాడుతున్నారని అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
లక్కీ లాటరీ సీఎం- డీకే అరుణ
ప్రధాని కులాన్ని ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటరిచ్చారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. రేవంత్ లక్కీ లాటరీ సీఎం అంటూ సెటైర్లు పేల్చారు. అంతే కాదు.. మిస్టర్ రేవంత్ రెడ్డి.. నోరు జారితే ఊరుకోను అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ సైతం ఇచ్చారామె. ముఖ్యమంత్రికి మతి తప్పిందని.. అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటూ విమర్శించారు డీకే అరుణ. ప్రధాని నరేంద్రమోదీని చూసి పాలనను నేర్చుకోవాలంటూ.. సీఎం రేవంత్ రెడ్డికి సలహా ఇచ్చారు ఎంపీ డీకే అరుణ. ఆయన్ను విమర్శించినంత మాత్రాన పెద్దవాళ్లై పోరన్నారు. ప్రపంచ దేశాల ముందు భారత్‌ను నిలిపే విషయంలో ప్రధాని ఎంతో శ్రమిస్తున్నారని.. ఆయన్ను చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో నేర్చుకోవాల్సి ఉందంటూ హితవు పలికారు బీజేపీ ఎంపీ డీకే అరుణ.
లోపాయికారి ఒప్పందం- అరవింద్
బీజేపీని బలహీనపరిచే కుట్రలో భాగంగా… సీఎం రేవంత్ రెడ్డి కుల రాజకీయాల చేస్తున్నారని అన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు లోపాయికారి రాజకీయ ఒప్పందంతో రాష్ట్రంలో కమలాన్ని బలహీనపరిచేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. వారు పన్నే ఏ కుట్రలూ సఫలీకృతం కావన్నారు ధర్మపురి అర్వింద్. కుల రాజకీయాల కుట్రలో పడొద్దని బీజేపీ శ్రేణులకు సూచించారాయన.
సీఎంది అవగాహనారాహిత్యం-ఆర్. కృష్ణయ్య
ప్రధాని మోదీ బీసీ కాదని సీఎం రేవంత్ రెడ్డి కించపరచడాన్ని తీవ్రంగా ఖండించారు కమలం ఎంపీ ఆర్. కృష్ణయ్య. ప్రధానమంత్రి కన్వర్టెడ్ బీసీ అని ముఖ్యమంత్రి అనడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనం అన్నారు. మోదీ… బీసీల్లో గాండ్ల కులానికి చెందిన వ్యక్తి అని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రి వర్గంలో 27 మంది బీసీలకు అవకాశం కల్పించారని, గవర్నర్ పోస్టుల్లోను ప్రాధాన్యం ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బీసీ సమస్యలపై జరుగుతున్న ఉద్యమాలను పక్కదారి పట్టించడానికి కాంగ్రెస్ వేసిన ఎత్తుగడ ఇదని మండిపడ్డారు కృష్ణయ్య. దేశ ప్రధానిగా ఒక బీసీ వ్యక్తి ఉండడం ఇష్టం లేకనే ఇలాంటి పదజాలాలు వాడుతున్నారని ఫైరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య.
నా వ్యాఖ్యలను వక్రీకరించారు- రేవంత్ రెడ్డి
ప్రధాని మోదీ విషయంలో ఎలాంటి తప్పు మాట్లాడలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధానమంత్రిని ఏ మాత్రం కించ పరచలేదని స్పష్టం చేశారు. మోదీ పుట్టుకతో బీసీ కాదని మాత్రమే చెప్పానని అన్నారు. ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. మోదీ పుట్టుకతో బీసీ కాదు కాబట్టే.. బీసీల పట్ల ఆయనకు చిత్తశుద్ధి లేదని అన్నానని చెప్పారు. ప్రధాని మోదీకి బీసీలపై నిజంగా ప్రేమ ఉంటే జనగణనలో కులగణన చేయాలని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
అనవసర రాద్ధాంతం- మహేశ్ కుమార్ గౌడ్
ప్రధాని మోదీ కులం విషయంలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై అనవసర రాద్దాంతం జరుగుతోందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అసలు బీసీలకు ప్రధాని మోదీ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు మహేష్ గౌడ్.
అద్దంకి కౌంటర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీది ఏ కులం అంటూ బీజేపీ నేతలు చేసిన కామెంట్లకు కౌంటరిచ్చారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. కులమత రాజకీయాలు చేసే మీకు రాహుల్‌గాంధీ కులం ఏంటో తెలియని దుస్థితిలో ఉండటం సిగ్గుపడాల్సిన విషయం అన్నారు. రాహుల్‌గాంధీ కులం పండిత్ అంటే బ్రాహ్మణ కులం.. అని చెప్పుకొచ్చారు. రాహుల్ కాబోయే ప్రధాని అని… ఆ దృష్టితోనే గాంధీల కుటుంబాన్ని బీజేపీ నాయకులు కించపరుస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ కన్వర్టెడ్ బీసీ అని, ఒరిజినల్ బీసీ కాదన్నారు అద్దంకి దయాకర్.