స్వతంత్ర వెబ్ డెస్క్: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు, త్వరలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సంస్థాగతంగా బీజేపీ కీలక మార్పులు చేపట్టింది. ఈ క్రమంలో, తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు పార్టీ హైకమాండ్ ఓ కీలక పదవి అప్పగించింది. ఈటలను బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరిని నియమించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. తెలంగాణకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నియమించారు. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా ఎంపిక చేసింది. ఝార్ఖండ్ బీజేపీ చీఫ్‌గా మాజీ సీఎం బాబూలాల్ మరాండీ, పంజాబ్ బీజేపీ నూతన అధ్యక్షుడిగా సునీల్ జాఖర్‌ను నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ అధినాయకత్వం ఈ మార్పులు చేసినట్టు తెలుస్తోంది. త్వరలో మరికొన్ని రాష్ట్రాలకు కూడా కొత్త అధ్యక్షులను ప్రకటించే అవకాశాలున్నాయి.