గత ప్రభుత్వ హయాంలో పోలవరాన్ని నాశనం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వైసీపీ హయాంలో 3శాతం పనులు మాత్రమే చేపట్టారన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్ట్‌ను సర్వనాశనం చేశారన్నారు. ఆగస్టు, అక్టోబర్‌లో వరదలకు డయాఫ్రం వాల్ పూర్తిగా దెబ్బతినిందన్నారు. దాని తర్వాత పోలవరం ప్రాజెక్ట్‌ను నిర్వీర్యం చేశారని.. పట్టించుకోలేదని విమర్శించారు. 2020లో రెండూ కాఫర్ డ్యామ్‌ల వద్ద నీరు చేరి దెబ్బతినే పరిస్థితి వచ్చిందన్నారు చంద్రబాబు.
పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో వేగం పెంచుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు 72శాతం పోలవరం పనులను పూర్తి చేశామన్నారు. గత ప్రభుత్వం రావడంతోనే పోలవరం కాంట్రాక్టర్‌ను మార్చారని విమర్శించారు. దాదాపు 15 నెలలపాటు పోలవరంలో ఎలాంటి పనులు చేపట్టలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక పోలవరానికి.. కేంద్రం 12వేల 157 కోట్ల నిధులు మంజూరు చేసిందని చెప్పారు. జనవరి 2నుంచి కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభం అవుతాయన్నారు. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తి చేయాలని ఆదేశించామని చంద్రబాబు తెలిపారు.