బంగ్లాదేశ్ క్రికెట్ స్టార్ షకీబ్ అల్ హసన్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ భారీ షాక్ ఇచ్చింది. తన బౌలింగ్ యాక్షన్ నిబంధలకు అనుగుణంగా లేదని తేల్చిన ICC.. హసన్ బౌలింగ్ చేయడానికి వీల్లేదని నిషేధం విధించింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని ఇటు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా వెల్లడింది. ఐసీసీ నిర్ణయతో హసన్ డొమెస్టిక్ క్రికెట్ సహా ఎక్కడా బౌలింగ్ చేయడానికి వీలులేదని ప్రకటించింది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు విచారణ అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. అంతర్జాతీయ క్రికెట్ తోపాటు విదేశాల్లోని మ్యాచ్‌లలో షకీబ్ బౌలింగ్ వేయడానికి అనర్హుడని..అతడి బౌలింగ్ యాక్షన్ కారణంగానే ఈ పరిస్థితి ఎదురైందని చెప్పుకొచ్చింది. ఐసీసీ నిర్ణయంతో జాతీయ క్రికెట్ ఫెడరేషన్‌లో బౌలింగ్ చేసేందుకు వీల్లేదని బంగ్లా క్రికెట్ బోర్డు తెలిపింది. దీంతో హసన్‌కు ఊహించని భారీ షాక్ తగిలింది.
బౌలింగ్ యాక్షన్‌కు సంబంధించి ఐసీసీ కొన్ని నిబంధనలను పొందుపరిచింది. బౌలింగ్ వేసేటప్పుడు మోచేయి 15 డిగ్రీలకు మించి వంచకూడదన్న రూల్ ఉంది. అయితే షకీబ్ బౌలింగ్ వేసేటప్పుడు ఈ నిబంధనను పాటించకపోవడం వల్లే అతనిపై వేటు పడినట్టు తెలుస్తోంది. మళ్లీ షకీబ్ బౌలింగ్‌లో రాణించాలంటే ఐసీసీ నిబంధనల మేరకు తన శైలిని మార్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఐసీసీ నుంచి అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పటివరకు అతను బౌలింగ్ చేయడానికి వీలు లేదు. ఇకపోతే బౌలింగ్ యాక్షన్‌పై గతంలోనూ పలువురు క్రికెటర్లపై ఆరోపణలు వచ్చాయి. శ్రీలంక లెజెండ్ ముత్తయ్య మురళీధరన్, పాక్ క్రికెటర్ సయ్యద్ అజ్మల్, వెస్టిండీస్ క్రికెటర్ సునీల్ నరైన్‌తోపాటు పలువురిపై ఆరోపణలు వచ్చాయి.
37 ఏళ్ల షకీబ్ హసన్ ఈ ఏడాదే టెస్టుల నుంచి తప్పుకున్నాడు. అయితే సౌతాఫ్రికాతో సొంతగడ్డపై మీర్పూర్ లో జరిగే టెస్టులో బరిలోకి దిగి టెస్టులకు రిటైర్మెంట్ పలకాలని భావించినా, దేశంలో అల్లర్ల కారణంగా అది వీలుకాలేదు. మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన పార్టీలో ఎంపీగా వ్యవహరించడంతో షకీబ్‌పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో అతను సొంతగడ్డపై అడుగు పెట్ట లేక పోయాడు. విదేశాల్లోనే ఉంటూ కాలం గడుపుతున్నాడు.
మరోపక్క కేవలం వన్డేలకు మాత్రమే పరిమితమైన షకీబ్ ను బీసీబీ పట్టించుకోవడం లేదు. ఈ కారణంగానే ఇటీవల జరిగిన వెస్టిండీస్, అంతకుముందు అఫ్గానిస్థాన్ జరిగిన వన్డేలకు ఎంపిక చేయలేదన్న సమాచారం. ఇక ఐసీసీ నిషేధంతో షకీబ్ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక 2006లొ అరంగేట్రం చేసిన షకీబ్.. ఇప్పటివరకు మూడు ఫార్మాట్లు కలిపి 447 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు. ఇందులో 14 సెంచరీలు ఉన్నాయి. అన్ని ఫార్మాట్లు కలిపి 700ల వికెట్లు తీశాడు.