కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన భరోసా

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న నయా వ్యూహం సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడం ఖాయమని, అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు బాధ్యతను పూర్తిగా పార్టీ కార్యకర్తలకే అప్పగిస్తామని జగన్ బహాటంగా ప్రకటించారు. ఈ హామీ క్షేత్రస్థాయిలోని సాధారణ కార్యకర్తల్లో అమితమైన ఉత్సాహాన్ని నింపుతుంటే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఎమ్మెల్యే అభ్యర్థుల గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెత్తిస్తోంది. ఇంతకీ సంక్షేమ పథకాల పంపిణీ బాధ్యతలను కార్యకర్తలకు ఇస్తామన్న జగన్ వ్యూహం పార్టీకి మేలు చేస్తుందా? ఎమ్మెల్యేలను విస్మరించి కేవలం కార్యకర్తలకే పెద్దపీట వేయడం వల్ల క్షేత్రస్థాయిలో ఎలాంటి రాజకీయ పరిణామాలు ఎదురుకాబోతున్నాయి?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్షేత్రస్థాయి కేడర్‌ను తిరిగి యాక్టివ్ చేసేందుకు అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలమైన అడుగులు వేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా జరుగుతున్న అంతర్గత సమావేశాల్లో ఆయన కార్యకర్తలకు ఒక స్పష్టమైన, బలమైన భరోసాను కల్పిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం నూటికి నూరు శాతం ఖాయమని ఆయన కేడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, గతంలో వాలంటీర్లు చేసిన సంక్షేమ పథకాల అమలు బాధ్యతలను, అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తిగా పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల చేతుల్లోనే పెడతామని ఆయన కుండబద్దలు కొట్టారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసిన ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. అధినేత నోటి నుంచి వచ్చిన ఈ సంచలన హామీతో.. ఇన్నాళ్లు నైరాశ్యంలో ఉన్న క్షేత్రస్థాయి కార్యకర్తల్లో ఒక్కసారిగా నయా జోష్ అమితంగా పెరిగిపోయింది. తమకు భవిష్యత్తులో దక్కబోయే ప్రభుత్వ గుర్తింపును తలుచుకుని కేడర్ నూతనోత్సాహంతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించింది.

అయితే, జగన్ ఇచ్చిన ఈ హామీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపినప్పటికీ.. వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న ఎమ్మెల్యే అభ్యర్థుల్లో మాత్రం తీవ్ర స్థాయిలొ వణుకు పుట్టిస్తోంది. సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపికలో తమకు ఎలాంటి ప్రమేయం ఉండదేమోనన్న భయం వారిని నిలువునా తొలిచివేస్తోంది. నియోజకవర్గంలో కోట్లు ఖర్చు పెట్టి, అహర్నిశలు కష్టపడి ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత.. ప్రభుత్వ పథకాల పంపిణీపై కనీస పెత్తనం లేకపోతే తమకు ప్రజల్లో విలువ ఏముంటుందన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. కేవలం శాసనసభ సమావేశాలకు హాజరుకావడానికి, నియోజకవర్గంలో ప్రారంభోత్సవాల రిబ్బన్లు కత్తిరించడానికి మాత్రమే పరిమితం కావాల్సి వస్తుందన్న చేదు వాస్తవం వారిని కలవరపెడుతోంది. ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చే పథకాల ఎంపికలో స్థానిక ఎమ్మెల్యేల సంతకానికి కనీస విలువ లేనప్పుడు, కేడర్‌ను మరియు ఓటర్లను తమ వైపు ఎలా నిలుపుకోగలమనే సందిగ్ధంలో నాయకులు పడిపోయారు.

ఎమ్మెల్యే అభ్యర్థుల ఈ భయానికి గడిచిన ఐదేళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విధానమే అసలైన కారణం. 2019 ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల పంపిణీ కోసం ప్రత్యేకంగా వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చారు. ప్రతి నెలా ఒకటో తేదీనే ఉదయాన్నే పింఛన్ల పంపిణీ దగ్గరి నుంచి, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల వరకు ప్రతి ఒక్క పథకాన్ని వాలంటీర్లు నేరుగా లబ్ధిదారుల గుమ్మం వద్దకే వెళ్లి అందజేసేవారు. ఈ మొత్తం ప్రక్రియలో స్థానిక ప్రజాప్రతినిధులకు గానీ, ఎమ్మెల్యేలకు గానీ కనీస ప్రమేయం ఉండేది కాదు. దీంతో జగన్ పాలనలో ఎమ్మెల్యేలు కేవలం ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారన్న అపవాదును మూటగట్టుకున్నారు. ఆనాటి చేదు అనుభవాలను నేతలు బయటకు చెప్పుకోలేక, అధినేత వద్ద ప్రస్తావించినా ఎలాంటి ఫలితం లేక తీవ్రంగా సతమతమయ్యారు. వాలంటీర్ల వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి ‘డ్రీమ్ ప్రాజెక్ట్’ కావడంతో, దానిలో ఉన్న లోపాలను ఆయనకు ధైర్యంగా చెప్పే సాహసం ఏ ఒక్క ఎమ్మెల్యే చేయలేకపోయారు. అధినేత చుట్టూ చేరిన కోటరీ కేవలం భజన చేయడానికే పరిమితం కావడంతో, క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు పడుతున్న మానసిక క్షోభ అధిష్టానానికి చేరనేలేదు.

గత ప్రభుత్వ హయాంలో సొంత పార్టీ కార్యకర్తలను, స్థానిక నాయకత్వాన్ని పూర్తిగా విస్మరించి కేవలం వాలంటీర్ల పైనే ఆధారపడటం వల్ల గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ఎన్నికల ముంగిట సంక్షేమ పథకాల పంపిణీకి వాలంటీర్లను దూరంగా ఉంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న సంచలన నిర్ణయం వైసీపీ వ్యూహాలను నిలువునా దెబ్బతీసింది. అప్పటికే ఐదేళ్ల పాటు తమను పక్కన పెట్టారనే కోపంతో ఉన్న పార్టీ సాంప్రదాయ కార్యకర్తలు.. ఎన్నికల సమయంలో క్షేత్రస్థాయిలో పనిచేయడానికి ఆసక్తి చూపలేదు. పోలింగ్ రోజున బూత్ లెవెల్లో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించే ‘ఎలక్షనీరింగ్’ ప్రక్రియను భుజాన వేసుకునే నాథుడే లేకుండా పోయాడు. అటు వాలంటీర్లు పనిచేయక, ఇటు కేడర్ సహకరించక ఎన్నికల మేనేజ్‌మెంట్‌లో వైసీపీ అపారమైన వైఫల్యాన్ని చవిచూసింది. ఫలితంగా రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం పదకొండు అసెంబ్లీ స్థానాలకే పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. వ్యవస్థలపై మోజులో పడి సొంత సైన్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో ఈ ఎన్నికలు నిరూపించాయి.

గత వైఫల్యాల నుంచి గుణపాఠం నేర్చుకుని కేడర్‌ను, నాయకులను సమన్వయం చేసుకుంటారని భావించిన తరుణంలో.. మళ్లీ పాత పద్ధతిలోనే పథకాల అమలు బాధ్యత కార్యకర్తలకే ఇస్తామనడం నేతలను విస్మయానికి గురిచేస్తోంది. ‘ఈయన ఎప్పటికీ మారడు’ అంటూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు అప్పుడే ఆఫ్ ది రికార్డుగా నిరాశతో పెదవి విరుస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు సముచిత న్యాయం చేయాలి, వారికి తగిన గుర్తింపు ఇవ్వాలి.. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ, అదే సమయంలో నియోజకవర్గ పాలనలో ఎమ్మెల్యేలకు పూర్తి ప్రాధాన్యత ఇస్తేనే క్షేత్రస్థాయిలో సమన్వయం సాధ్యమవుతుంది. ఒకరిని అందలం ఎక్కించి, మరొకరిని డెకరేషన్ పీస్‌లా మార్చే పద్ధతిని విడనాడకపోతే ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాబట్టడం అసాధ్యమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. కార్యకర్తల ఆత్మగౌరవాన్ని, ఎమ్మెల్యేల పరిపాలనా అధికారాలను సమానంగా బ్యాలెన్స్ చేయాలన్న కనీస లాజిక్‌ను జగన్మోహన్ రెడ్డి విస్మరిస్తే.. భవిష్యత్తులో ఈ పార్టీని ఎవరూ కాపాడలేరన్న గూడుకట్టుకున్న నిరాశలోకి కొందరు అభ్యర్థులు అప్పుడే జారిపోయారు.

Latest Articles

కేసీఆర్ తిరిగి సీఎం కావాలని ప్రజలు నిజంగానే కోరుకుంటున్నారా?

తెలంగాణ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి సరికొత్త మైండ్ గేమ్‌కు తెరతీసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. కేటీఆర్, హరీశ్ రావు ద్వయం ఒక కొత్త...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్