రాజ్యసభలో ఏపీకి చెందిన ముగ్గురు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. బీద మస్తాన్‌రావు, ఆర్ కృష్ణయ్య, సానా సతీష్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో… ఈ ముగ్గురి చేత ప్రమాణం చేయించారు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్. ఇటీవల రాజ్యసభ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులుగా బీద మస్తాన్ రావు, సానా సతీష్, బీజేపీ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్యల బరిలో దిగారు. ఈ ముగ్గురు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదే విషయాన్ని ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఇవాళ రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్‌ఖడ్ ఈ ముగ్గురితో ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే,..ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమిలోని పార్టీలు 164 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ సంఖ్యాబలంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమైంది.
ఈ ఏడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది. దీంతో కేవలం 11 సీట్లు మాత్రమే కైవసం చేసుకుని వైసీపీ ఘోర పరాజయం పాలైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో పార్టీ నేతలంతా వరుసగా రాజీనామా బాట పట్టారు. ఈక్రమంలోనే వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్లిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు, ఆర్ కృష్ణయ్యలు పార్టీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు.. రాజ్యసభ పదవులకు సైతం రాజీనామా చేశారు. దీంతో ఈ మూడు రాజ్యసభ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీష్ బరిలో దిగగా.. బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య బరిలో నిలిచారు. ఈ ఉప ఎన్నికల్లో వీరి ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.