స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: పార్లమెంట్ నూతన భవనం నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ నెల 30తో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తవుతుంది. దీంతో ఈనెల 28న సెంట్రల్ విస్టా భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. రూ. 970 కోట్ల అంచనా వ్యయంతో 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నాలుగు అంతస్తుల్లో ఈ భవనం నిర్మించారు. హాలులో 1,224 మంది ఎంపీలు కూర్చోనేలా ఏర్పాట్లు చేశారు. భవనంలోని మూడు ప్రధాన ద్వారాలకు జ్ఞాన, శక్తి, కర్మ అని పేర్లు పెట్టారు.
పార్లమెంటుతో పాటు కేంద్ర సచివాలయం, ప్రధాని కార్యాలయం, ప్రధాని నివాసం, ఉప రాష్ట్రపతి భవనం వంటివి కొత్తగా నిర్మించారు. ఈసారి జీ-20 కూటమికి భారత్ సారథ్యం వహిస్తుండడంతో తొలుత 20 దేశాల పార్లమెంటు స్పీకర్లతో ఇక్కడ సమావేశం నిర్వహిస్తారు. అనంతరం పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కాగా పార్లమెంటు కొత్త భవనానికి డిసెంబరు 10, 2020న ప్రధాని మోదీ శంకుస్థాపన చేయగా.. జనవరి 15, 2021న పనులు ప్రారంభమయ్యాయి.