విజయవాడ: కోడికత్తి కేసులో విచారణకు హాజరుకావాలని సీఎం జగన్(Jagan)ను విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు (NIA court) ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 10న విచారణకు సీఎం జగన్ హాజరుకావాలని కోర్టు స్పష్టం చేసింది. సీఎంతో పాటు పీఏ నాగేశ్వరరెడ్డి కూడా హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చింది. ఇవాళ సాక్షి ఎయిర్ పోర్టు అథారిటీ కమాండర్ దినేశ్ ను న్యాయస్థానం విచారించింది. ఈ సందర్భంగా పోలీసులు కోడికత్తిని, మరో చిన్న కత్తి, పర్సును కోర్టుకు అప్పగించారు. అనంతరం, తదుపరి విచారణను ఏప్రిల్ 10వ తేదీకి వాయిదా వేసింది. కాగా 2019 ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్ పోర్టులో అప్పటి ప్రతిపక్ష నేత జగన్ పై కోడికత్తి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు విచారణ ఎన్ఐఏ కోర్టులో జరుగుతోంది.