స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ తనను నిందించిన ప్రతిసారి ఇంకా పతనమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఇప్పటివరకు తనను 91సార్లు కాంగ్రెస్ అవమానించిందని.. తనను అవమానించే పని కాంగ్రెస్ నేతలు చేసుకోండని.. తాను మాత్రం కర్ణాటక ప్రజల కోసం పనిచేస్తానని వ్యాఖ్యానించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లింగాయత్ వర్గాన్ని అవమానిస్తారు.. అంబేద్కర్, వీరసావర్కర్ వంటి మహనీయులను అవమానిస్తారు.. తనను విషసర్పంతో పోలుస్తారు.. ఎంత బురద చల్లాలని ప్రయత్నిస్తే కమలం అంత వికసిస్తుందని మోదీ తెలిపారు . డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంటే.. రాష్ట్రం కూడా డబుల్ స్పీడుతో దూసుకెళ్తుందన్నారు. కాగా గతంలో మోదీని కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విష సర్పంతో పోల్చిన సంగతి తెలిసిందే.